Bhadradri Ramayya: ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు – Telugu News | TSRTC to home deliver Bhadradri ‘Talambralu’ Check Details

Written by RAJU

Published on:

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివ‌రీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ‌ శ్రీకారం చుట్టింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.in లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు సంస్థ హోం డెలివరీ చేస్తుంది.

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోంద‌ని సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-69440069, 040-69440000ను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Subscribe for notification