Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

Written by RAJU

Published on:

భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలం (Bhadrachalam)లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయం (Ramalayam)లో శ్రీ రామ మహా పట్టాభిషేకం (Sri Maha Pattabhishekam) జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ (Telangana Governor) జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) హాజరవుతున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పట్టాభిషేక క్రతువు జరుగుతుంది. కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు. సోమవారం నిర్వహించే ఈ పట్టాభిషేకానికి భద్రాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీరామ మహాపట్టాభిషేకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే ఈ రోజు రాత్రి రథోత్సవం జరుగుతుంది.

Also Read..: పరారీలోనే కాకాణి.. పోలీసుల వైఫల్యం..

వైభవంగా సీతారాముల కల్యాణం..

కాగా ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా.. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం చేశారు. తదుపరి ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. ఉదయం 9.45 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తరామదాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజేశారు.

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి తొలిసారి సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత ఉదయం 11.33 గంటలకు రామాలయానికి చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. పూజల తర్వాత సీఎం దంపతులు 11.45 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ జీలకర్రబెల్లం సమయంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రామయ్యకు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నం సమీపించగానే వేద పండితులు ఉత్సవమూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం మూడు సూత్రాలతో కన్నుల పండువగా మాంగళ్య ధారణ నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి తిలకించారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. టీటీడీ తరఫున చైర్మన్‌ బీఆర్‌ నాయుడు శ్రీసీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Ad

Updated Date – Apr 07 , 2025 | 07:44 AM

Subscribe for notification
Verified by MonsterInsights