- తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరామలు పేరును తొలగింపు
- తీవ్రంగా స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా?
- దమ్ముంటే సీఎం నా సవాల్ పై స్పందించాలి : బండి సంజయ్

Bandi Sanjay : సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు వంటి ప్రముఖుల పేర్లు తొలగించే ధైర్యం ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు దేశభక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి అని, ఆయన హరిజనుల ఆలయ ప్రవేశం కోసం పోరాడిన మహనీయుడు అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని అవమానించడం తగదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి, ఆర్యవైశ్య వ్యతిరేకి అని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులే ఓడించారని, బీజేపీ అభ్యర్థిని కార్యకర్తలే గెలిపించారని తెలిపారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తూ, స్థానిక ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకలా మారుస్తోందని, రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. 15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని, త్వరలోనే రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపేలా చేయబోతున్నారని ఆరోపించారు.
బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. పార్టీ కట్టుదాటిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపగా, పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన నిర్ణయంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ మొదలైంది.
CNG cars: ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు.. టాప్ వేరియంట్ CNG కార్లు ఇవే