- రేవంత్-కేటీఆర్ మధ్య రహస్య ఒప్పందం?
- వక్ఫ్ బిల్లు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కలిసి వ్యూహం
- హెచ్ సీయూ భూములపై సీబీఐ విచారణకు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి పని చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా, వాస్తవానికి వీరి మధ్య రహస్య ఒప్పందం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు అని, ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ ఆరోపించారు. చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్‌కు ఇద్దరూ కలిసి వెళ్లిన దానికి ఇదే నిదర్శనమన్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లో జరగబోయే సమావేశాన్ని కూడా ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారని, వీరిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలిపారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఓటేయించారని, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్‌ను గెలిపించేందుకు వీరిద్దరూ కలిసి ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం కూడా రేవంత్‌కు మద్దతు ఇచ్చేందుకే చేసిన చర్య అని తెలిపారు.
తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీని నిలబెట్టకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై జరిగిన భూ దందాకు సంబంధించిన సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో కేసీఆర్ లేదా రేవంత్ ప్రభుత్వాలు ఏమాత్రం సహకరించలేవని, కేంద్రంలో మోదీ సర్కారే భూదందా, అవినీతిపై ఉక్కుపాదం మోపుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
హెచ్ సీయూ భూముల వ్యవహారాన్ని సీబీఐ విచారణ ద్వారా బహిరంగం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల ఆశలతో ఆడుకుంటున్న ఈ ద్వంద్వ రాజకీయ నాయకుల అసలైన ముఖాలను బహిర్గతం చేయడానికి బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Rajasthan: దళిత ఎమ్మెల్యే వచ్చాడని ఆలయ “శుద్ధి”.. వివాదస్పద నేతని సస్పెండ్ చేసిన బీజేపీ..