భర్తీకి సిద్ధంగా 56 వేలకు పైగా ఉద్యోగాలు
ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు
త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు!
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గుర్తించి.. ఖరారు చేసిన 14,236 అంగన్‌వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్-1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితోపాటు గ్రూప్-2, 3, 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భ ర్తీకిగాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుని 2024-25 జాబ్ క్యాలెండర్‌ను రూపొందించింది. అయితే ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించినట్తు తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా..
రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుళ్లు, 1,650 వరకు ఎస్‌ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఇవికాకుండా మరో 2వేల వరకు నర్స్ పోస్టులు సహా మరికొన్ని వివిధ స్థాయిల పోస్టులున్నాయని, మొత్తంగా వైద్యారోగ్య శాఖలో సుమారు 6వేల పోస్టుల వరకు భర్తీ చేసే అ వకాశం ఉందని సమాచారం. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, పలు శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లో కలిపి దాదాపు 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్‌అండ్‌బీలో 185-200 వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అటవీ శాఖలోనూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలిసింది. ఇవే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్‌లు, 7,837 హెల్పర్‌లు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
4వేల జీపీవో పోస్టులకు నోటిఫికేషన్..
గ్రామ పరిపాలన అఽధికారి (జీపీవో) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారి నుంచిదాదాపు 6వేల మంది వీఆర్వోలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించన్నారు. మిగిలిన 4వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. వాస్తవానికి అంగన్‌వాడీల్లో టీచర్, హెల్పర్‌ల పోస్టుల భర్తీ కోసం గతంలోనే ప్రభుత్వ ఆమోదం లభించినా.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రెవెన్యూ, అంగన్‌వాడీ టీచర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ఆయా శాఖల అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. ఆ జిల్లాను మినహాయించి మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న పోస్టులు మాత్రమే కాకుండా స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ల(ఏటీసీ)లో అవసరమైన పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితోపాటు న్యాయశాఖ, సచివాలయం, ఆర్థికశాఖ సహా మరికొన్ని శాఖలన్నింటిలో కలిపి మరో 7-8 వేల పోస్టులు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే తేల్చి అన్నింటినీ కలిపి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టు అధికారిక వర్గాలు అంటున్నాయి.
వైద్యారోగ్య శాఖలోని పెండింగ్ ఫలితాల విడుదల..
ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖలోని ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్‌నర్సులు కలిపి 6 వేల పోస్టులకు గతే డాది పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు వెలువరించాల్సి ఉంది. ఈ ఫలితాలను ఏప్రిల్ 28 తరువాత విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.
వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా..
పోలీసు శాఖ 12,150
వైద్యశాఖ 2,762
ఆర్టీసీ 3,038
గురుకులాలు 2,850
ఇంజనీరింగ్ 2,510
వ్యవసాయ శాఖ 148
ఆర్‌అండ్‌బీ 185
రెవెన్యూ 10,954
మహిళా శిశుసంక్షేమం 14,236
పలు ఇతర శాఖల్లో ఖాళీలు,
గ్రూప్ 1 పోస్టులు ఉండే చాన్స్
Updated Date – Apr 17 , 2025 | 04:06 AM