-
ఆరోగ్య శాఖలో రహస్యంగా టెండర్ల ఖరారు
-
ప్రక్రియపై ఎమ్మెల్యేల ఫిర్యాదు.. విచారణ
-
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు టెక్నికల్ కమిటీ టెండర్లను ఖరారు చేసింది. ఏయే కంపెనీలను ఎంపిక చేశారన్న విషయాన్ని మాత్రం అధికారులు బయటకు రానివ్వడం లేదు. ఎల్1 కంపెనీల పేర్లు బయట పెట్టకుండా రహస్యంగా ఉంచారు. గురువారం ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ నేతృత్వంలో కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలకు టెండర్లు ఖరారు చేశారు. అన్ని జోన్‌లకు ఎల్1 కంపెనీలను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ టెండర్ ప్రక్రియపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్1 కంపెనీల పేర్లు రహస్యంగా ఉంచడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. దీనికితోడు ఏపీఎంఎ్‌సఐడీసీ టెండర్ ప్రక్రియ మొత్తాన్ని గందరగోళం చేసింది. శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్లు మొత్తం మెడికల్ టెర్మనాలజీ, కెమికల్స్ వ్యవహారాల్లో అనుభవం ఉన్న అధికారికి అప్పగించాలి. అయితే దాదాపు రూ.1400 కోట్లు విలువైన టెండర్ల విషయంలో సాధారణ ఇంజనీర్‌కు అప్పగించారు. సదరు అధికారి తనకు నచ్చినట్లు టెండర్ నిబంధనలతో కంపెనీలకు అర్హత కల్పించారన్న విమర్శలున్నాయి. టెండర్ల ప్రక్రియపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేలు అనేక మంది ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
నిబంధనలు మార్పు
శానిటేషన్, సెక్యూరిటీ టెండర్లల్లో నిబంధనలను అధికారులు ఇష్టారాజ్యాంగా మార్చేశారు. అధికారులు టెండర్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన నిబంధనలకు వారే తిలోదకాలు ఇచ్చారు. తొలుత టెండర్ డాక్యుమెంట్‌లో జోన్‌ల వారీగా ఎంతమంది శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి? వారికి ఎంత జీతం ఇవ్వాలి? ఎంత మొత్తంలో కెమికల్స్ ఉపయోగించాలి? దానికి అయ్యే ఖర్చు ఎంత? అన్న వివరాలు ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు పొందుపరిచారు. బిడ్ దాఖలు చేసే కంపెనీ కేవలం సర్వీస్ చార్జీ ఎంత అన్న విషయాన్ని మాత్రమే బిడ్‌లో పొందుపరచాలని సృష్టంగా చెప్పారు. దాని ఆధారంగానే ఎల్1 కంపెనీ ఎంపిక జరుగుతుందని సృష్టం చేశారు. అది కూడా సర్వీస్ చార్జీ 3.38 శాతం నుంచి 7.7 శాతం మించకూడదన్న నిబంధన పెట్టారు. చివరికి బిడ్ దాఖలు చేసే సమయంలో జోన్ల వారీగా ఎంతమంది సిబ్బందిని నియమిస్తారు? వారికి ఎంత మొత్తంలో జీతాలు చెల్లిస్తారు? ఎంత మొత్తంలో కెమికల్స్ ఉపయోగిస్తారు? అన్న వివరాలు కూడా పొందుపరచాలన్న నిబంధనలు పెట్టారు.
ఫిర్యాదులు పరిశీలిస్తాం
టెండర్ ప్రక్రియలో పాల్గొన్న ఒక కంపెనీపై కొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించి, విచారణ చేస్తామి, ఆ తర్వాత టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్తామని ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు.
For More AP News and Telugu News
Updated Date – Mar 28 , 2025 | 05:54 AM