
తెలుగు రాష్ట్రాల్లో విభిన్నవాతావరణం జనాన్నిఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు ఒక్కపోత..మరోవైపు అకాల వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు రోజులు రాష్టానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సోమ, మంగళవారం ఎండలు దంచి కొడతాయని వార్నింగ్ బెల్ మోగించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రిపోర్ట్ చెబుతోంది. అంతేకాదు కొన్ని చోట్ల వడ గాల్పులు వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారి చేశారు. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల మధ్య బైటికి రావద్దని imd సూచించింది. ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, అటు ఏపీలోనూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రానున్న రెండు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
IMD, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదికల ప్రకారం, రాయలసీమ, పల్నాడు, గుంటూరు, ఉత్తరాంధ్రలో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42.7 డిగ్రీల వరకు చేరుకున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ సీజనల్ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు ఎక్కువే. అదే సమయంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు వేడి మరోవైపు వర్షంతో ..రోజువారీ జీవనంతో పాటు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
వడగాల్పులు ఆంధ్రప్రదేశ్‌లో 66 మండలాల్లో స్వల్పంగా, 7 మండలాల్లో తీవ్రంగా నమోదయ్యాయి. రాయలసీమలో వడగాల్పులు మరింత తీవ్రంగా ఉన్నాయి, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లా అట్లూరులో 41.4 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలులు ప్రజల రోజువారీ పనులపై తీవ్ర ప్రబావం చూపుతున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏప్రిల్ 13-16 మధ్య తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది
ఏప్రిల్ నెలలో అసాధారణంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలే ఈ విభిన్న వాతావరణానికి కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. వర్షాలు, సముద్రతీర ప్రాంతాల సామీప్యత వల్ల ఆర్ద్రత స్థాయిలు పెరుగుతున్నాయి., ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది.