ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ (TDP) అధిష్ఠానానికి 48 గంటల డెడ్‌లైన్ (48-Hour Deadline) విధిస్తూ అల్టిమేటం జారీ చేసిన తిరువూరు ఎమ్మెల్యే (Tiruvuru MLA) కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) వ్యాఖ్యల దుమారం కాక రేపింది. కొలికపూడి ‘యాక్షన్’పై అధిష్ఠానం వెంటనే ‘రియాక్ట్’ అయ్యింది. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ను రంగంలోకి దింపిన రాష్ట్ర నాయకత్వం వెంటనే నివేదిక కోరింది. ఏఎంసీ మాజీ చైర్మన్ రమేశ్‌రెడ్డిపై ఆరోపణలు, ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఆయన వివరాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక పంపారు. అంతేకాదు.. రాష్ట్ర కార్యాలయం నుంచి తిరువూరు నాయకులకు ఫోన్లు వస్తుండటంతో ఇక్కడి రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది.
తిరువూరులో ఉత్కంఠ..
తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హిట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఐవిఆర్ఎస్, ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను అధిష్టానం తెప్పించుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే కొలికపూడి బహిరంగ సవాల్ విసిరారు. కాగా బోసుబొమ్మ సెంటర్ వేదికగా జరగనున్న పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. పోలీస్, ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసులు మోహరించారు.
Also Read..: మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం..
రాజీనామా ఎందుకు చేస్తానన్నారు..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధిష్ఠానానికి ఎందుకు అల్టిమేటం జారీ చేశారు.. రాజీనామా ఎందుకు చేస్తానన్నారు.. ఏఎంసీ మాజీ చైర్మన్ ఆలవాల రమేశ్‌రెడ్డి వివాదం ఏమిటి.. అనే వివరాలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం శుక్రవారం సేకరించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో నెట్టెం మాట్లాడారు. గిరిజన మహిళపై ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్‌రెడ్డిని కూడా వివరణ కోరారు. ఫోన్ కాల్ గురించి కూడా అడిగినట్టు తెలిసింది. వివరాలన్నీ సేకరించిన నెట్టెం రఘురామ్.. అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను అధిష్ఠానం పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనుంది.
కొలికపూడి తీరుపై జిల్లా నేతల అసంతృప్తి..
కొలికపూడి తీరుపై టీడీపీ జిల్లా నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. రమేశ్‌రెడ్డి ఉదంతంపై తమకు ఫిర్యాదు అందగా, విచారణ జరుపుతున్న దశలోనే అల్టిమేటం జారీ చేయటంతో షాకైంది. ఎమ్మెల్యేగా గెలిచిన ఎనిమిది నెలల్లోనే కొలికపూడి చర్యలు తీవ్ర వివాదాస్పదం కావటం, ప్రతిసారీ పార్టీకి తలనొప్పులు తీసుకురావటం ఇబ్బందికర పరిణామాలుగా మారాయి. పలు వివాదాస్పద ఘటనలకు సంబంధించి పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయన్ను సముదాయించినా, సుతిమెత్తగా చెప్పినా మార్పు రావటం లేదని జిల్లా పార్టీ అఽభిప్రాయపడుతోంది. ఇప్పటికే అధిష్ఠానం ఒకసారి ఆయన్ను పిలిచి మాట్లాడింది. ఆ తర్వాత కూడా పార్టీకి తీవ్ర తలనొప్పులు రావటంతో రెండుసార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం మందు ఆయన హాజరు కావాల్సి వచ్చింది. తాజాగా అధిష్ఠానానికే అల్టిమేటం జారీ చేయటంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
వైసీపీతో సంబంధాలపైనా ఆరా..
కొలికపూడికి వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాటిపైనా జిల్లా పార్టీ దృష్టిసారించి విచారణ జరిపినట్టుగా సమాచారం. ఇసుక రవాణాకు సంబంధించి స్థానిక వైసీపీ నాయకులతో ఆయనకు సంబంధాలున్నాయని పార్టీ కార్యకర్తలే ఆరోపణలు చేస్తుండటంతో మూలాలేంటో తెలుసుకున్నారు. అధిష్ఠానానికి ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు కూడా పొందుపరిచినట్టు తెలిసింది.
తిరువూరు నేతలకు ఫోన్లు
అధిష్ఠానం ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయ సిబ్బంది తిరువూరు నియోజకవర్గ నేతలకు శుక్రవారం ఫోన్లు చేశారు. అన్ని మండలాలు, వార్డు అధ్యక్షులకు ఈ ఫోన్లు వెళ్లాయి. వీరిలో చాలామంది కొలికపూడి వ్యాఖ్యలను ఖండించినట్టుగా తెలుస్తోంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశాలున్నా కొలికపూడి దుందుడుకుతనంతో వ్యవహరించారని వారు అభిప్రాయపడ్డారు. పార్టీకి అల్టిమేటం జారీ చేయటం తగదని, సమస్యను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే సరిపోయేదని చెప్పినట్టు సమాచారం. ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, అధిష్ఠానం తక్షణం చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నా…
నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ఇలా చేస్తే కూలర్ క్షణాల్లో పని చేస్తుంది..
For More AP News and Telugu News
Updated Date – Mar 29 , 2025 | 12:58 PM