-
టీచర్లకు చార్జ్ మెమోలు
-
ప్రకాశంలో 149, గుంటూరులో 22 మందికి
-
పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
-
కావాలనే వేధిస్తున్నారని సంఘాల ఆగ్రహం
-
మెమోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
రోజూ 2 ప్రాథమిక పాఠశాలలు పరిశీలించండి
-
ఏ అంశంలో లోపాలున్నా చర్యలు తీసుకోవాలి
-
ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌జేడీ
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులపై సర్కారు వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో అనేకసార్లు నోటీసులతో వారిని ఇబ్బందులకు గురిచేయగా కొంతకాలంగా వాటిని నిలిపివేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు చార్జ్ మెమోల పేరుతో వేధింపులకు దిగుతోంది. ప్రకాశం జిల్లాలో 149 మందికి, గుంటూరులో 22 మంది టీచర్లకు తాజాగా చార్జ్ మెమోలు జారీచేశారు. విద్యార్థుల వద్ద వర్క్‌బుక్‌లు లేవని, సిలబస్ పూర్తిచేయలేదని, ఇతరత్రా కారణాలతో ఈ మెమోలు ఇస్తున్నారు. పది రోజుల్లో వాటికి వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిబంధన విధించింది. వారి వివరణతో సంతృప్తి చెందకపోతే వారికి శిక్ష విధించే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బడులను ఎంఈవోలతో తనిఖీలు చేయిస్తున్నారు. ప్రతి మండలంలో రోజుకు రెండు ప్రాథమిక పాఠశాలలు పరిశీలించాలని తాజాగా ఆర్జేడీ ఆదేశాలిచ్చారు. 27 అంశాలతో ఒక ఫాం రూపొందించి వాటిలో ఏ ఒక్క అంశంలో లోపాలున్నా చర్యలు చేపట్టాలన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలోనే ఇలా తమపై వేధింపులకు దిగుతున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు.
ఉపసంహరించుకోవాలి: టీఎన్‌యూఎస్
టీచర్లకు జారీచేసిన చార్జ్ మెమోలను ఉపసంహరించుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రతిదానికీ మెమోలు ఇచ్చుకుంటూ వెళ్తే టీచర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వేధించడం తగదు: ఆపస్
విద్యార్థుల వర్క్‌బుక్‌లు దిద్దలేదని, నోట్స్ రాయించలేదని రకరకాల కారణాలతో మెమోలు జారీచేస్తూ టీచర్లను వేధించడం తగదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్‌కుమార్, ఎస్.బాలాజీ అన్నారు. వెంటనే చార్జ్ మెమోలు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
మరిన్న ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date – 2023-11-25T12:43:30+05:30 IST