పార్వతీపురం మన్యం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ తో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ప్రతి గ్రామంలో వైరల్ విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేక ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో ప్రబలిన విష జ్వరాలతో గిరిజనులు హడలెత్తుతున్నారు. సహజంగా వర్షాకాలంలో విజృంభించే విష జ్వరాలు ఇప్పుడు మండుటెండల్లో తాండవిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ తో మలేరియా వంటి జ్వరాలు అధికంగా ఉన్నాయి. రోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సిబ్బందికి వైద్య సేవలు అందించడం కూడా కష్టతరంగా మారుతుంది. గుమ్మ లక్ష్మీ పురం మండలం తాటికొండ తో పాటు పలు గ్రామాల్లో జ్వరాల బారిన పడ్డారు గిరిజనులు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయితే అక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేక అవస్థలు తప్పడం లేదు. ఒకే బెడ్ పై ఇద్దరు ముగ్గురు రోగులు చికిత్స పొందుతున్నారు. కొందరికి బెడ్స్ ఖాళీ లేక టేబుల్స్ పై ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వైరల్ ఫివర్స్ తో మలేరియా కూడా ప్రభలుతుంది. మలేరియా నివారణ కోసం కావల్సిన మెడిసిన్ కానీ, మలేరియా కిట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కొత్తగా మలేరియా కేసులు రాకుండా అదుపు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చేసేదిలేక గ్రామాల నుండి పట్టణాల్లో ఆసుపత్రుల బాట పడుతున్నారు రోగులు. మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ హాస్పిటల్స్ కి వెళితే అక్కడ వేల రూపాయలు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా రోగుల తాకిడి పెరగడంతో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. ఇప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నరకం చూపిస్తుంది.
అపరిశుభ్ర వాతావరణంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అంతేకాకుండా వేసవికాలం నీటి ఎద్దడితో ఊటలు, చలముల బాట పడుతున్నారు గిరిజనులు. అలా వెళ్లడంతో ఊటలు వద్ద తిష్ట వేసి ఉండే దోమలు మలేరియాకు కారణమవుతున్నట్లు భావిస్తున్నారు వైద్యులు. దోమలు ఏజెన్సీవాసులని నరకం చూపిస్తుంది. దోమకాటుతో మలేరియా, వైరల్ ఫివర్స్ ప్రభలుతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య కురుపాం, గుమ్మలక్ష్మి పురం మండలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో సమీపంలో ఉన్న భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు. ఈ హాస్పటల్ యాభై పడకల ఆసుపత్రి గా అప్ గ్రెడ్ అయినా బెడ్స్ మాత్రం రాలేదు.
దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అధికారులు త్వరితగతిన గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తో పాటు నీటి ఎద్దడి లేకుండా చేస్తే కొంతమేర జ్వరాలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో వారు కూడా టెన్సన్ లో ఉన్నారు. జిల్లాలో మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతుండగా, డెంగ్యూ సోకే అవకాశం కూడా ఉందని ఆందోళన చెందుతున్నారు జిల్లావాసులు. పారిశుధ్య సమస్య కారణంగా ఏజెన్సీవాసులు అనారోగ్యబారిన పడుతున్న అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు గిరిజన సంఘాల నాయకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.