Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే రక్త హీనత ఉన్నట్టే..

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందాలంటే హిమోగ్లోబిన్ కీలకం. హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రొటీన్ అని వైద్యులు చెబుతున్నారు. ఎర్ర రక్త కణాల్లో ఉండే ఈ ప్రోటీన్ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సీజన్‌ను చేరవేస్తుంది. అయితే, హిమోగ్లోబిన్ తగ్గడాన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఈ సమస్య ఉన్న వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలేవో ఈ కథనంలో తెలుసుకుందాం (Symptoms of Anemia).

ఆక్సిజన్‌ను శరీరంలోని ప్రతి భాగానికి చేర్చడంలో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి, హిమోగ్లోబిన్ తక్కువైనప్పుడు వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో, ఎనర్జీ లెవెల్స్ తగ్గి నిత్యం అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది.

Copper Bottles Vs Steel Bottes: స్టీల్ నీళ్ల బాటిల్స్ కంటే రాగి నీళ్ల బాటిల్స్ ఆరోగ్యకారకమా

హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు కండరాలకు, ఊపిరితిత్తులకు కూడా ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో, నిత్యం ఆయాసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న పనులకే అలసిపోయినట్టు ఊపిరి అందనట్టు భావన కలుగుతుంది.

హిమోగ్లోబిన్ తగ్గిన వారిలో ముఖం రంగు కూడా చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. చర్మానికి రక్త సరఫరా తగ్గడమే ఇందుకు కారణం.

హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు కూడా తగినంత ఆక్సీజన్ అందదు. దీంతో, తల తిరుగుతున్నట్టు లేదా మత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వేగంగా లేచి నిలబడినప్పుడు లేదా సడెన్‌గా కూర్చున్నప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది.

కాళ్లకు చేతులకు ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు అకస్మాత్తుగా వాటి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దీంతో, కాళ్లు, చేతులు చల్లబడినట్టు అనిపిస్తాయి.

Orange: నారింజతో ఇలాంటి ప్రయోజనం కూడా ఉందా..

హిమోగ్లోబిన్ తగ్గిన సందర్భాల్లో గుండెకు కూడా ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో, రక్తాన్ని పంపు చేసేందుకు గుండె మరింతగా శ్రమించాల్సి వస్తుంది. అలాంటప్పుడు గుండె చలనంలో మార్పులు వచ్చి దడ వస్తుంది.

ఆక్సిజన్ సరఫరా తగ్గిన సందర్భాల్లో ఛాతిలో కూడా నొప్పిగా లేదా అసౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్లంల్లో చిన్న చిన్న పనులకే అలసిపోవడం, ఛాతిలో ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

ఈ సమస్య తలెత్తినప్పుడు ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తింటే పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చికెన్, చేపలు, బీన్స్, ఆకు కూరలు, విటమిన్ సీ అధికంగా ఉన్న ఆహారాలన్నీ రక్తహీనత తగ్గించేందుకు సాయపడతాయి.

Read Latest and Health News

Subscribe for notification