Andhra Pradesh: తాచుపాము కరిచినా 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి.. – Telugu News | Student attends 10th Exams Despite Being Bitten By Cobra in Anaparthi Mandal East Godavari District

Written by RAJU

Published on:

ఓ వైపు జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ ఎగ్జామ్.. మరోవైపు ప్రాణాలనే కబళించే తాచుపాము కాటు. అయితే ప్రాణాలను రిస్కులో పెట్టి మరీ ఆ విద్యార్థి పదవ తరగతి పరీక్ష రాశాడు.  వివరాల్లోకి వెళ్తే.. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వై నిస్సి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉండగా.. పక్కనే ఉన్న ఓ రాయిపై వేలు పెట్టడంతో తాచుపాము కాటు వేసింది. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిన అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవడంతో ఆసుపత్రి నుంచే ఉదయం నేరుగా లక్ష్మీ నరసాపురంలోని పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష విజయవంతంగా పరీక్ష రాశాడు ఆ విద్యార్థి. అనంతరం మళ్లీ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు.

సాధారణంగా పాములు.. పొలాలు, అడవులు, ఏజెన్సీ ప్రాంతాల్లో… నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే  సంచరిస్తూ ఉంటాయి. ఐతే అడవులు క్రమంగా తగ్గిపోవడం వల్ల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి. అందునా ఇప్పుడు వేసవి సమీపించడంతో.. వేడి తాపానికి నీటి కోసం అవి జనాలు ఉండే ప్రాంతాలకు వస్తూ ఉంటాయి.  పాముల బెడద తగ్గాలంటే అడవులను విచ్చలవిడిగా నరకడాన్ని ఆపేయాలి. నీటి కాలుష్యాన్ని తగ్గించాలి.  పాము కరచినపుడు నాటు వైద్యం, మంత్రవైద్యం కాకుండా తప్పనిసరిగా ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదు. భయపడకుండా ధైర్యంగా ఉంటే.. సగం బ్రతికినట్లే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Subscribe for notification