గేమింగ్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి. డబ్బు ఆశ చూపి.. ఉన్నదంతా ఊడ్చడమే కాకుండా అప్పులు చేసి ప్రాణాలు కూడా తీసుకునేలా చేస్తున్నాయి. ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నా.. గేమింగ్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల అరాచకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా.. బెట్టింగ్‌లు, గేమింగ్‌లతో అప్పుల ఊబిలో చిక్కుకుని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే.. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మరో యువకుడు బలయ్యాడు. కడప రామేశ్వరానికి చెందిన ప్రేమ్‌సాయిరెడ్డి అనే యువకుడు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌తో 8 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చేందుకు దారి లేకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోనే ఉరి వేసుకున్న కన్నకొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమ్‌సాయిరెడ్డి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇక.. కన్నవారికి కడుపు కోతలు మిగుల్చుతున్న బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. బెట్టింగ్, గేమింగ్ ఊబిలో చిక్కుకుని యువత.. అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలపై కొద్దిరోజుల నుంచి టీవీ9 కూడా సమరం సాగిస్తోంది. బెట్టింగ్ యాప్స్ చీకటి బాగోతాలను ఆధారాలతో బయటపెట్టడంతో పాటు..వాటి మాయలో పడి ప్రాణాలు తీసుకుంటున్న బాధితులపై వరుసగా కథనాలను ప్రసారం చేస్తోంది.
దాంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..