ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు హైస్పీడుతో ఇంట్లోకి దూసుకెళ్లింది.. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మెడికోలు.. ఓ వ్యక్తి ఉన్నారు. మెడికోలు మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారంతా మత్తులో ఉన్నారంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.. వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వచ్చిన కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రమణయ్య (50) సహా కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. వీరంతా నారాయణ మెడికల్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పేర్కొంటున్నారు. మృతులు నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఈ ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు.
నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకకు బుధవారం మెడికోలు హాజరయ్యారు. అనంతరం కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా.. ముంబై.. జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిందని స్థానికులు చెప్పారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120కిమీ ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..