Andhra: సముద్రంలో నేటి నుంచి వేట నిషేధం అమలు… ఎందుకంటే – Telugu Information | 61 day fishing ban might have an effect on livelihood; value of dried fish goes up

Written by RAJU

Published on:

సముద్ర తీరప్రాంతంలో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. కాని ప్రతిఏటా 61 రోజులు పాటు వేట నిషేధం అమలులో ఉంటుంది. దీన్ని అతిక్రమిస్తే సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం – 1944 ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మొదలయ్యే వేట నిషేధం జూన్ 14 వరకు కొనసాగుతుంది. సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం వేట నిషేధాన్ని ప్రధానంగా అమలు చేస్తుంటారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవటంతో పాటు వారి వద్ద నుంచి పట్టిన చేపలు స్వాధీనం చేసుకుంటారు. ఇక ప్రభుత్వం నుంచి అందాల్సిన డీజిల్ రాయితీలు సైతం అందవు. నిషేధం సక్రమంగా అమలు చేసేందుకు మత్స్య శాఖతో పాటు కోస్ట్ గార్డ్, నేవీ, రెవిన్యూ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెడతారు.

ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 19 కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల పరిధిలో పేరుపాలెం, కెపి పాలెం, మోళ్లపర్రు, వేముల దీవి, పెదమైనవానిలంక, చినమైనవాని లంక, బియ్యపు తిప్ప గ్రామాల్లో పలువురు సముద్రంలో వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం తీరప్రాంతంలో ఉన్న 12 గ్రామాల్లో 38,652 మంది జనాభా ఉంటే వీరిలో 9,558 మంది వేటకు నిత్యం వెలుతుంటారు. వీరిలో సముద్రంలోకి వేటకు వెళ్లే వారు 1814 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా మొత్తం జిల్లా లో 145 మోటరైజ్డ్ బోట్లు, 312 నాన్ మోటరైజ్డ్ బోట్లతో పాటు ఒక మెకనైజ్డ్ బోటు ఉంది.

వేట నిషేధం అమలులో ఉన్న సమయంలో గంగ పుత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతియేటా భృతి అందిస్తుంది. గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.20వేలు భృతి కింద సహాయం చేయనుంది. దీనికి సంబంధించిన లబ్ధిదారులను అధికారులు గుర్తించనున్నారు. ఇక వేట నిషేధం అమలులోకి రావడంతో.. పచ్చి చేపలు దొరక్క.. ఎండు చేపలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights