Andhra: నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..

Written by RAJU

Published on:

Andhra: నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..

దొంగలు పలు రకాలు అన్నట్టు.. ఇటీవల వాళ్లందరూ చోరీల్లో రాటుదేలుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా కొందరు.. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసే మహిళలే లక్ష్యంగా మరికొందరు.. శివారు ప్రాంతాల ఇళ్ళు, దుకాణాల్లో ఇంకొందరు ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు. బంగారం, డబ్బు ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల అయితే ట్రాన్స్‌ఫార్మర్లలో వైర్లు దొంగిలిస్తున్నారు.. అందులో ఉండే కాపర్‌ కోసం ఈ పని చేస్తున్నారు. చెడ్డీ దొంగల గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఆవుల దొంగలు బయలుదేరారు. రోడ్లపై సంచరించే ఆవులను అపహరించుకుపోతున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో తరచుగా గోవుల దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో రోడ్డుపై సంచరిస్తున్న గోవులనే టార్గెట్‌ చేస్తోంది ఈ ముఠా. కాపుకాసి గోవులను ఎత్తుకెళ్లిపోతోంది. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో రాత్రి వేళ ఆవులను తాళ్లతో కట్టి బొలెరోలో తరలిస్తుండగా ఆ దృశ్యాలు అక్కడి స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గూడూరులోని శివారు ప్రాంతాలైన గాంధీనగర్, పారిచెర్ల, తిలక్ నగర్, ఇందిరానగర్ ఏరియాలనే ఈ దొంగల మూఠా టార్గెట్ చేస్తోంది. లక్షలు విలువ చేసే పశువులను అపహరించుకుని వెళ్లిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా ఈ దొంగల ముఠాను పట్టుకోవాలని వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Subscribe for notification