
కారులో వస్తారు.. వీధుల్లో తిరుగుతారు.. రహదారి పక్కన, పార్కింగ్ స్థలాల్లో నిలిపిన లారీల్లోని డీజిల్‌ను దొంగిలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఆదోని పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆ దొంగల ముఠా ఆటకట్టించారు. ముఠా సభ్యులు ఇప్పటి వరకు కర్నూలు, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో 10వేల లీటర్లకుపైగా డీజిల్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన 14 మంది కలిసి ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ కారులో తిరుగుతూ ఎక్కడ లారీలు నిలిపి ఉంటాయో రెక్కీ నిర్వహిస్తారు. కొందరు కాపలా ఉంటే.. మరికొందరు లారీ వద్దకు వెళ్తారు. డీజిల్ ట్యాంకుల తాళాలు పగలగొట్టి అందులో పైపులు వేసి తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ క్యాన్లలో నింపుకొంటారు. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. చోరీ చేసిన ఇంధనాన్ని విడిగా విక్రయించే చిరు వ్యాపారులకు ఇచ్చి సొమ్ము చేసుకొంటున్నారు.
ఆదోని డీఎస్పీ హేమలత తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదోని వన్ టౌన్ పరిధిలోని ఓ పార్కింగ్ స్థలంలో మార్చి 23 , ఏప్రిల్ 08 తేల్లో పార్క్ చేసిన ఉన్న లారీల్లో సుమారు 5 వేల లీటర్ల మేర డీజిల్ చోరీ జరిగింది. బాధితులు ఏప్రిల్ 8వ తేదీన వన్ టౌన్ పీఎస్ లో ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీఎస్పీ హేమలత.. ఒకటో పట్టణ సీఐ, సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం లోని నారాయణ పేటలో నిందితులను గుర్తించి 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు 10 వేల 600 లీటర్ల డీజిల్ దొంగిలించినట్టు తేలింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారికోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ10 లక్షల , 30 వేల నగదు , నాలుగు కార్లు , 350 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.