జామచెట్టుకు కాస్తాయ్ జామకాయలో… జామకాయలో… మామిడిచెట్టుకు కాస్తాయ్ మామిడి కాయలో… మామిడి కాయలో… అన్న సినీ సాంగ్ ఎంత ఫేమస్సో, ఆ ఊళ్లో ఓ ఇంట్లోని మునగచెట్టు అంత ఫేమస్… మా మునగచెట్టుకు కాస్తాయ్ మునక్కాయలో… మునక్కాయలో… అంటూ రాగాలు తీస్తున్నారట అక్కడి జనాలు… సాధారణంగా మునక్కాయలు రెండు లేదా మహా అయితే 3 అడుగుల పొడవుంటాయి… అయితే ఆ ఇంటి పెరట్లో ఉన్న మునగచెట్టు కాయలు మనిషంత ఎత్తు పెరుగుతున్నాయి… ఈ విషయాన్ని ఆ ఊరి జనం వింతగా చెప్పుకుంటున్నారు… తమ ఇంట్లో కూడా మునగచెట్లను పెంచుకుంటున్నారట… ఇంతకీ ఎక్కడుందా చిత్రమైన మునచెట్టు..?
బాపట్ల జిల్లా మార్టూరు నేతాజీ నగర్లోని శానం లక్ష్మీ ఇంటి ఆవరణలో మునగ చెట్టు విరగ కాపు కాసింది. ఆకుల కన్నా కాయలు ఎక్కువగా కనిపించటం … అవి కూడా ఐదు, ఆరు అడుగుల పొడవు ఉండటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతటి పొడవైన మునగ కాయలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఆశ్చర్యంగా కాపు కాసిన మునక్కాయలు చూసేందుకు ఊళ్ళో జనం తరలివస్తున్నారు. ఆరు అడుగుల పైగా కాయలు పొడవుగా ఉండటం ఒక విశేషమైతే… కాపు అసాధారణంగా ఉండటం మరో విచిత్రం. రైతులు ఇలాంటి మునగ పంటను పండిస్తే లాభాల పంటగా మారుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని చెట్లు ఇలా విరగకాసే అవకాశాలు తక్కువంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. జన్యు పరమైన కారణాల వల్ల చాలా అరుదుగా మాత్రమే ఇలా విరగకాపు ఉంటుందంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..