ఆ గ్రామంలో కాంట్రాక్టర్ సిమెంట్ రోడ్డు వేసేందుకు టెండర్ దక్కించుకున్నాడు. మహాత్మాగాంధీ ఉపాధి పధకం కింద రోడ్డు వేసేందుకు 4.10 లక్షలు మంజూరయ్యాయి. అంతా బాగానే ఉంది, ఇప్పుడెందుకీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా.! ఒక్కసారి ఈ ఫోటో చూడండి. రోడ్డుకు అడ్డంగా కారు ఉండగా, దాన్ని పక్కకు తీయకుండానే రోడ్డువేసేశాడు ఆ కాంట్రాక్టర్. కారు యజమాని ఆసుపత్రి పనిమీద కుటుంబంతో సహా ఊరెళ్ళగా అతనికి సమాచారం ఇవ్వకుండానే, కారు పక్కకు తీయకుండానే సిమెంట్ రోడ్డు వేయడంతో తన కారు డ్యామేజ్ జరిగిందని కారు యజమాని కాంట్రాక్టర్‌పై, అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. అయితే అధికారులు మాత్రం ఏడాదిగా ఆ కారు అక్కడే ఉందని, రోడ్డుకు అడ్డంగా ఉన్నందున పక్కకు తొలగించాలని కారు యజమానికి చెప్పినా పట్టించుకోకపోవడంతోనే అలా రోడ్డు వేయాల్సి వచ్చిందంటున్నారు.
బాపట్ల జిల్లా దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నం గ్రామంలో 68 మీటర్ల సిమెంట్ రోడ్డు వేసేందుకు గత ఏడాది 4.10 లక్షలు మంజూరయ్యాయి. దీంతో రోడ్డు నిర్మాణం కోసం కొలతలు వేశారు. అయితే కొలతల్లో తేడా ఉందని, రోడ్డుపక్కన ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు వేయాలంటూ అదే వీధికి చెందిన యర్ర రూపానంద్ అనే వ్యక్తి వేటపాలెం తహసీల్దార్‌కు ఈనెల 9వ తేదీన అర్జీ ఇచ్చారు. ఆ తరువాత తాను ఆసుపత్రి పనిమీద కుటుంబంతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. యర్ర రూపానంద్ కారు రోడ్డువైపు కొద్ది భాగంగా పార్క్ చేసి ఉంది. ఈనెల 12న యర్రం రూపానంద్ అందుబాటులో లేకపోవడంతో రోడ్డుకు కొద్దిగా అడ్డు ఉన్న కారును పక్కకు తీయకుండానే కాంట్రాక్టర్ రోడ్డు వేసేశాడు. అడ్డుగా ఉన్న కారు పక్క నుంచి రోడ్డు వేయడంతో కారు టైర్లు కొంతభాగం సిమెంట్‌లో కూరుకుపోయాయి. రోడ్డు వేసిన తరువాత రూపానంద్ ఇంటికి వచ్చి చూస్తే తన కారు తొలగించకుండానే, తనకు సమాచారం కూడా ఇవ్వకుండా రోడ్డువేసిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, తన కుటుంబం ఊళ్లో లేని సమయంలో రోడ్డు వేశారని, కారు అడ్డంగా ఉన్నా, తనకు సమాచారం ఇవ్వకుండా కారు డ్యామేజ్ జరిగే విధంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్, పిఆర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేటపాలెం పియస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తతంగాన్ని చూసిన గ్రామస్థులు కూడా గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదేనని చర్చించుకుంటున్నారు.
అయితే అధికారుల వెర్షన్ మరోలా ఉంది. ఏడాది క్రితం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును యజమాని రూపానంద్ పక్కకు తొలగించలేదని చెబుతున్నారు. దీని కారణంగానే ఏడాది కాలంగా రోడ్డు నిర్మించలేదంటున్నారు. కారు ఉన్న స్థలం తనదేనంటూ దాన్ని తీయకుండా రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకం కలిగించడంతో కారు పక్కనుంచి కాంట్రాక్టర్ రోడ్డు వేయాల్సి వచ్చిందంటున్నారు. ఇప్పుడు రోడ్డు వేస్తే తన కారుకు డ్యామేజ్ జరిగిందని ఆరోపిస్తున్నాడని అధికారులు చెబుతున్నారు… కారును తాము చెప్పినప్పుడే తీసి ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..