Amma odi: అమ్మలతోనూ కొసరు బేరాలేనా!? ఇప్పటికీ ఒడికి చేరలేదు!

Written by RAJU

Published on:

అమ్మఒడి ఖాతాల్లో రూ.5 వేలు, రూ.9 వేలు

అయోమయంలో అమ్మలు

డబ్బులేకున్నా బటన్‌ నొక్కిన ఫలితమిదీ

అమ్మఒడికి కావాల్సింది రూ.6 వేల కోట్లు

బటన్‌ నొక్కేనాటికి ఖజానాలో రూ.2 వేల కోట్లే

వాటినే ఇన్నాళ్లుగా సర్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం

మిగతాది కార్పొరేషన్ల ద్వారా ఇస్తామని మెసేజ్‌లు

20 రోజులు దాటినా పూర్తిగా అందని సొమ్ము

అందిన చోటకూడా చాలాఖాతాల్లోకి అరకొర

డబ్బులు పడనివారిలో పెరుగుతున్న టెన్షన్‌

సచివాలయాల సిబ్బందితో ఘర్షణలు

ముఖ్యమంత్రి జగన్‌ గత నెల 28వ తేదీన విజయనగరం జిల్లా కురుపాంలో అమ్మఒడి నగదు జమల కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి ప్రారంభించారు.

ప్రకాశంజిల్లా పామూరులో మొదట్లో కొందరు తల్లుల ఖాతాలకు రూ.13వేల చొప్పున పడ్డాయి. అయితే, ఆ తర్వాత మాత్రం చాలామంది అమ్మల ఖాతాల్లో రూ.తొమ్మిదివేలు పడటం మొదలైంది. తమ ఫోన్లకు వచ్చిన బ్యాంక్‌ మెసేజ్‌లను చూసి వారంతా కంగారు పడిపోతున్నారు. బ్యాంకులు, సచివాలయాల వద్దకు గతకొద్ది రోజులుగా పరుగులు పెడుతున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): నవరత్నాలకు ఆర్భాటంగా బటన్‌ నొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్‌ (CM JAGAN), అవి పడుతున్నాయో…లేదో చూడటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చదువుకునే పిల్లలున్న ప్రతి ఇంటిలో ఒకరికి చొప్పున రూ.13 వేలు అందే అమ్మఒడి (Amma odi) పథకానికి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి 20 రోజులు దాటిపోయింది. అయినా, ఇంకా రాష్ట్రంలోని అందరి తల్లుల ఖాతాల్లోకి సొమ్ములు చేరలేదు. పైగా కొన్ని జిల్లాల్లో కొంతమందికి రూ.తొమ్మిది వేలు, మరికొన్ని చోట్ల రూ.ఐదువేలు కూడా పడిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ‘మిగిలిన మొత్తం త్వరలో జమ చేస్తామ’ంటూ వస్తున్న మెసేజ్‌లు చూసుకుని అమ్మలు అయోమయానికి గురిఅవుతున్నారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా తక్కిన సొమ్ములు ఇస్తామని చెబుతున్నారు. దీంతో అమ్మఒడి వాయిదాలఒడిగా మారిందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. అసలే అమ్మఒడి పథకంపై రాష్ట్రవ్యాప్తంగా తల్లులకు అపనమ్మకం ఎక్కువైంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని జగన్‌ తాను అధికారానికి రాకముందు చెప్పి…ఆ తర్వాత మాట మార్చారు. 80 లక్షల మంది అర్హత కలిగిన లబ్ధిదారులకుగాను 45 లక్షల మందికి మాత్రమే మంజూరుచేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత మంజూరైనవారిలో కూడా అందరికీ పథకం అందడం లేదు. ఆరంచెల వడపోత పోసి జాబితాలను సచివాలయాలకు పంపించారు. అయితే సచివాలయాలకు పంపిన జాబితాలో పేరున్న వారికి సైతం అమ్మఒడి పడటం లేదు. ఈ విషయం సచివాలయ సిబ్బందిని అడిగితే, తమకేమీ తెలియదని చేతులెత్తేస్తున్నారు. ఇప్పుడు ఇస్తామన్న రూ.13 వేలు కూడా నెలల తరబడి ఆలస్యం చేయడమే కాకుండా కొంత మందికి వాయిదా పద్ధతిలో కొంచెం కొంచెంగా విడుదల చేయడంపై తల్లులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే చెప్పినా… చాలా మంది ఖాతాల్లోకి అమ్మఒడి జమకాలేదని వారంతా గుర్తుచేస్తున్నారు.

ఒకసారి వస్తే మరోఏడాది డౌటే!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు దఫాలు ‘అమ్మఒడి’ విడుదల చేశారు. అయితే అర్హత ఉన్నా.. ఈ నాలుగు దఫాలూ అమ్మఒడి పొందిన తల్లులు సగంమంది కూడా ఉండరని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఒక ఏడాది పథకం తీసుకున్నవారికి మరో ఏడాది కూడా పడుతుందనే గ్యారంటీ లేని పరిస్థితి! లబ్ధిదారుల్లో కొందరికి రెండేళ్లు వేసి ఆపేస్తే.. మరికొందరికి మూడేళ్లు సొమ్ములు పడ్డాయి. మరోవైపు.. అర్హత ఉండి పథకం మంజూరైనప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరిగి సిబ్బందిని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

ఇదీ కారణం..!

అమ్మఒడి పథకం సుమారు 45 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరుచేస్తూ అన్నీ సచివాలయాలకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను విడుదల చేశారు. గత నెల 28న సీఎం బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు చొప్పున మొత్తం రూ.6300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అప్పుడు ప్రభుత్వం వద్ద కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఉన్నాయి. వాటినే ఇప్పటిదాకా సర్దుబాటు చేస్తున్నారు. అంటే.. మరో రూ. నాలుగు వేల కోట్లకుపైగా నిధుల కొరత అలాగే ఉంది. అమ్మల కష్టాలకు కారణం ఇది కాగా, ఆ విషయం చెప్పే సాహసం సచివాలయ సిబ్బంది చేయలేకపోతున్నారు. పత్రికల్లో, టీవీల్లో జగన్‌ ఇస్తున్న ప్రకటనలను చూసిన లబ్ధిదారులు… సచివాలయాల వద్దకు బార ులు తీరుతున్నారు. జగన్‌ ఎప్పుడో బటన్‌ నొక్కి విడుదల చేశారని, ఎందుకు తమకు డబ్బులు రాలేదంటూ ఉద్యోగులను నిలదీస్తున్నారు. ‘డబ్బులు లేకుండా బటన్‌ నొక్కడం మా చావుకొచ్చిం’దని సర్కారుపై సచివాలయ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘లాగిన్‌’లో సమస్యలు

కొత్తగా చేరిన పాఠశాలల్లో లాగిన్‌ చేయకపోవడం వల్ల అలాంటి విద్యార్థులకు అమ్మఒడి విడుదల కావడం లేదు. అదేవిధంగా గత ఏడాది టెన్త్‌ చదివిన విద్యార్థులు కొత్తగా ఇంటర్‌లో కళాశాలల్లో చేరుతున్నారు. వారికి కూడా మంజూరైనట్లు సచివాలయాలకు జాబితాలో పేర్లు వస్తున్నాయి. అయితే వారికి కళాశాలల్లో ఇంకా లాగిన్‌ చేయకపోవడంవల్ల అమ్మఒడి లబ్ధి అందటం లేదు. లాగిన్‌ ద్వారా విద్యార్థుల వివరాలు అప్‌లోడ్‌ చేయకపోతే అలాంటి వారికి డబ్బులు పడే అవకాశం ఉండదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ అమ్మఒడి జమచేయకపోవడంతో తమకు వస్తాయో…రావోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో ఎక్కువైంది. కొంత డబ్బు అందుకున్నవారు.. మిగతాది ఇంకెన్ని విడతల్లో జమచేస్తారోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date – 2023-07-24T15:57:20+05:30 IST

Subscribe for notification