- అమీన్‌పూర్‌లో దారుణ ఘటన
- తల్లి చేతిలో ముగ్గురు పిల్లల మృతి
- విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్‌పూర్‌లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను బయట పెట్టింది.
ఇటీవల, 10వ తరగతి విద్యార్థుల గెట్-టు-గెదర్ పార్టీలో రజితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. కుటుంబానికి దూరమై, తన ప్రియుడితో జీవించాలని రజిత నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య, పిల్లలను చంపేయాలనే దారుణ నిర్ణయానికి వచ్చింది. గత నెల 27న రాత్రి, భోజన సమయంలో రజిత పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే, భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకెళ్లిపోయాడు. పిల్లల్ని మాత్రం బలవంతంగా పెరుగన్నం తినిపించింది.
ఉదయానికల్లా పిల్లలు ముగ్గురు కూడా విగతజీవులై పడిపోయారు – సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8). భార్య రజిత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ, విచారణలో రజిత అసలు బాగోతం బయటపడింది.
పిల్లలు అనారోగ్యంతో మరణించలేదని, అవి హత్యలేనని పోలీసులు గ్రహించారు. రజిత గత కొన్ని నెలలుగా ప్రియుడితో కలిసి ఉండాలని అనుకున్నట్లు తెలిసింది. కుటుంబ బంధాలను పక్కనపెట్టి, అశుద్ధ సంబంధానికి బానిసై, ఓ తల్లి తన ముగ్గురు పిల్లలను ఎలా హత్య చేయగలిగింది? ఈ ఘటన మనిషి మనసులోని స్వార్థపూరిత భావాలను ప్రశ్నించేలా చేస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు నేడు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఈ ఘటన మన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా మారిపోతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. గతంలో కుటుంబాలు ఒకరికొకరు ఆధారంగా జీవించేవి. కానీ, ఇప్పుడు వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అవసరాలు పెరిగిపోతున్నాయి. పాతతరం విలువల నుంచి కొత్త తరం మరింత స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటోంది.
అయితే, అది ఎంత వరకు న్యాయమైనది? సమాజంలో బంధాలు మరిచిపోతూ, మానవ సంబంధాలు కేవలం లావాదేవీలుగా మారిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం చూస్తున్న సంఘటనల్లోనే దాగి ఉంది. బంధాలు నశించకుండా, మానవత్వం కోల్పోకుండా, నైతికత విలువలను నిలుపుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం, పరస్పర గౌరవం, ప్రేమ పెంపొందించుకోవడం తప్పనిసరి.
YS Jagan: నేడు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ..