వాయు కాలుష్యంతో అనేక సమస్యలు
శ్వాసకోశ అవయవ ఎదుగుదలపై ప్రభావం
నవజాత శిశువులపైనా కాలుష్య కాటు
హైదరాబాద్‌లో గత ఐదేళ్లలో ఆస్థమాతో
పుడుతున్న పిల్లల సంఖ్య 20% పెరుగుదల
తక్కువ బరువుతో పుట్టేవారు 15% అధికం
కామినేని వైద్యురాలు కంచన్ పరిశోధన
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): వాయుకాలుష్యం.. ఇది పెద్దలపైనే కాదు.. గర్భస్థ శిశువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పుట్టబోయే పిల్లలు కూడా కాలుష్యం ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా నవజాత శిశువులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి ఆస్థమా సమస్య ఉంటుండగా.. మరికొందరు తక్కువ బరువుతో పడుతున్నారు. గర్భిణులు కలుషిత గాలిని పీల్చడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఆస్థమాతో జన్మిస్తున్న పిల్లల సంఖ్య ఏకంగా 20 శాతం పెరిగిందని, అలాగే తక్కువ బరువుతో పుడుతున్న పిల్లల సంఖ్య 15 శాతం పెరిగినట్లు తన పరిశోధనలో తేలిందని కామినేని ఆస్పత్రి పిల్లల వైద్యురాలు కంచన్ ఎస్ చన్నావర్ చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో గాలి నాణ్యత నానాటికీ దిగజారిపోతోందని కంచన్ అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు, పారిశ్రామికీకరణతో పాటు వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో మనం పీల్చుకునే గాలి విషతుల్యంగా మారుతోందని చెప్పారు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి హానికరమైన ఉద్గారాలు కలిసిన కలుషిత గాలిని గర్భిణులు పీల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఆస్థమా బారిన పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
తల్లి పీల్చే కలుషిత గాలితో ముప్పే
గర్భిణులు కాలుష్యం బారిన పడితే కడుపులో ఉండే శిశువు శ్వాసకోశ అవయవాల ఎదుగుదల సరిగా ఉండదని కంచన్ చెప్పారు. ఆస్పత్రులకు వచ్చే పిల్లల్లో 50 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు ఉంటున్నాయన్నారు. వీరిలో 30-40 శాతం పిల్లలకు అలర్జీ, ఆస్థమా, గురక, అలర్జీ రినైటిస్ (గొంతులో దుమ్ము కారణంగా ఏర్పడే అలర్జీతో పాటు జ్వరం రావడం) వంటి జబ్బులు ఉంటున్నాయని తెలిపారు. చాలా మంది పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండడం లేదన్నారు. అలాంటి పిల్లలకు పల్మనరీ ఫంక్షన్ చేస్తే వాయు కాలుష్య ప్రభావం వల్ల అవయవాల ఎదుగుదలలో లోపం ఉన్నట్లు నిర్ధారణ అవుతుందని చెప్పారు. ఏడాది, రెండేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఈ సమస్యతో ఆస్పత్రికి వస్తున్నట్లు వివరించారు. శిశువులకు కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చి నెబ్యులైజర్ పెట్టాల్సి ఉంటుందన్నారు. సిగరెట్ పొగ కారణంగా కూడా పుట్టబోయే పిల్లలు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సిగరెట్ పొగలో సీసం, నికోటిన్, కోటినిన్, సైనైడ్, కాడ్మియం, పాదరసం, కార్బన్ మోనాక్సైడ్, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ గర్భంలోని పిండానికి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. తల్లి సిగరెట్ పొగను పీల్చడం ఆపివేసిన తర్వాత కూడా ఐదారు గంటల వరకు గర్భంలోని శిశువుకు ఆక్సిజన్ సరఫరా పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక హైపోక్సియా వచ్చే ముప్పు ఉంటుంది. కాబట్టి గర్భిణులు పొగ తాగడం మంచిది కాదని డాక్టర్ కంచన్ చెప్పారు. ఇంట్లో ఎవరికైనా ధూమపానం అలవాటు ఉంటే గర్భిణులకు దూరంగా వెళ్లాలని సూచించారు.
నవజాత శిశువుల ఇబ్బందులు వర్ణనాతీతం
కాలుష్యం కారణంగా నవజాత శిశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బాధలు వర్ణనాతీతం. నవజాత శిశువుల ఊపిరితిత్తులు చాలా సున్నితంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో కలుషిత గాలిని పీల్చడం వల్ల చిన్నారులను జీవితాంతం అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, గుండె కవాటాల జబ్బులు, నాడీ వ్యవస్థ సమస్యలు బాధిస్తాయి. పాలకులు, ప్రజలు కాలుష్య సమస్యపై తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలి. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించాలి. వ్యర్థాల నిర్వహణకు మెరుగైన విధానాలను రూపొందించి, అమలు చేయాలి. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగే పిల్లల భవిష్యత్తు మన చేతులు, చేతల్లోనే ఉంది. వారికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కల్పించాలి.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు
Read Latest and Viral News
Updated Date – Apr 12 , 2025 | 04:56 AM