ACB: విడదల రజినిపై ఎఫ్‌ఐఆర్‌ | ACB Recordsdata Case In opposition to Former Minister Vidadala Rajini in ₹2.20 Crore Extortion Case

Written by RAJU

Published on:

  • కేసు నమోదు చేసిన ఏసీబీ.. ఐపీఎస్‌ జాషువాపైనా

  • నిందితులుగా మరిది గోపి, పీఏ రామకృష్ణ

  • జగన్‌ హయాంలో మైనింగ్‌ వ్యాపారిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు

  • కూటమి సర్కారులో బాధితుడి ఫిర్యాదు

  • విజిలెన్స్‌ విచారణలో ఆధారాలు లభ్యం

  • కేసు పెట్టాలని ఏసీబీకి సర్కారు ఆదేశం

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో మైనింగ్‌ వ్యాపారిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై ఏసీబీ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది. నాడు ఆమె అరాచకాలకు కొమ్ముకాసిన ఐపీఎస్‌ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. అలాగే డబ్బుల కోసం మైనింగ్‌ వ్యాపారిని బెదిరించిన విడదల రజిని మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌(సీఐయూ) శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7, 7ఏతో పాటు ఐపీసీలోని 384, 120బీ, బీఎన్‌ఎస్ఎస్‌ 173, 176 కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది.

ఇదీ కేసు..

గత వైసీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం విశ్వనాథునికండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమాని నల్లపనేని చలపతిరావును విడదల రజిని బెదిరించారు. ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ద్వారా డిమాండ్‌ చేయించారు. ఆ తర్వాత అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్‌ అధికారి జాషువాతో పాటు తన మరిది గోపిని రంగంలోకి దించారు.

అయితే అన్ని అనుమతులూ తీసుకునే 10.163 హెక్టార్లలో మైనింగ్‌ చేస్తున్నామని, అక్రమాలకు పాల్పడలేదని, డబ్బులు ఎందుకు ఇవ్వాలని చలపతిరావు అభ్యంతరం చెప్పారు. దీంతో.. ‘ఎమ్మెల్యే అడిగితే ఇవ్వాల్సిందే. లేదంటే 50 కోట్ల రూపాయలు జరిమానా తప్పదు’ అంటూ ఐపీఎస్‌ అధికారి జాషువా బెదిరించారు. తన బృందంతో పాటు మైనింగ్‌, రెవెన్యూ అధికారులతో కలిసి 2020 సెప్టెంబరు 20న తనిఖీలు చేశారు. ఆ తర్వాత గుంటూరులోని తన కార్యాలయంలో జరిమానా విధించేందుకు అనుకూలంగా నివేదిక సిద్ధం చేయించారు. ఆ తర్వాత మరోసారి చలపతిరావును బెదిరించి బేరమాడారు. విధిలేని పరిస్థితుల్లో రెండు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చలపతిరావు అంగీకరించారు. 2021 ఏప్రిల్‌ 4న రాత్రి 11గంటల ప్రాంతంలో చిలకలూరిపేటలోని విడదల రజిని ఇం ట్లో ఆమె మరిది గోపి చేతికి రెండు కోట్ల రూపాయల నగదు ఇచ్చారు. అయితే తమకు చెరో పది లక్షలు ఇవ్వాలంటూ చలపతిరావును గోపి, జాషువా డిమాండ్‌ చేశారు. దీంతో వ్యాపార భాగస్వామి నంబూరి శ్రీనివాసరావు, పెరవలి నాగవంశీ ద్వారా విడదల గోపికి చిలకలూరిపేటలో, జాషువాకు గుంటూరులో వారు అడిగినంత మొత్తం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విడదల రజిని, జాషువాపై బాధితుడు చలపతి రావు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

మొదట విజిలెన్స్‌తో విచారణ

చలపతిరావు ఫిర్యాదుపై విచారించి వాస్తవాలు వెలికితీసి నివేదిక ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం విజిలెన్స్‌ అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. అప్పట్లో జాషువాతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారుల వాంగ్మూలాలు తీసుకున్నారు. జాషువా చెబితేనే తాము వెళ్లామని, విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఈ వ్యవహారం గురించి తెలియదని అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామస్థులు ఎవరూ స్టోన్‌ క్రషర్‌పై ఫిర్యాదు చేయలేదని, మాజీ మంత్రి విడదల రజిని ఆదేశాల మేరకే జాషువా బెదిరించారని విజిలెన్స్‌ తేల్చింది. డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 10న కేసు నమోదు చేయాలని ఏసీబీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జాషువాపై చర్యలకు సిఫారసు

చట్టాన్ని ఉల్లంఘించిన ఐపీఎస్‌ అధికారి జాషువాపై చర్యకు విజిలెన్స్‌ సిఫారసు చేసింది. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ 1970 ప్రకారం జాషువా చాలా పెద్ద తప్పు చేశారని పేర్కొంది. సివిల్‌ సర్వీస్‌ అధికారి చట్టాన్ని పక్కనబెట్టి, పైఅధికారుల అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం పనిచేయడాన్ని నేరంగా పరిగణించింది. ఎలాంటి ఫిర్యాదు లేకున్నా మైనింగ్‌ వ్యాపారిని బెదిరించడంతో పాటు పది లక్షల రూపాయలు తీసుకోవడంపై చర్య తీసుకోవచ్చని పేర్కొంది. వైసీపీ హయాంలో కృష్ణా, చిత్తూరు ఎస్పీగా పనిచేసిన జాషువా ఆ పార్టీ నేతల అరాచకాలకు వంతపాడినట్టు ఆరోపణలున్నాయి.

నాడు ఎన్నో అరాచకాలు

జగన్‌ అరాచక పాలనలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొందరు ఐపీఎస్‌లు మాఫియాగా ఏర్పడి వ్యాపారస్తుల్ని బెదిరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు వ్యాపారాలు చేసుకోవాలన్నా ఆ పార్టీ నేతలకు కప్పం కట్టి తీరాల్సిందే. బిహార్‌ లాంటి చోట్ల నడిచే దందాకు ఏపీలో కొందరు మంత్రులు తెరతీశారు. సకల శాఖల మంత్రిగా పేరున్న నాయకుడి అండదండలతో రెచ్చిపోయారు. అలాంటి మంత్రుల్లో విడదల రజిని ఒకరు. విదేశాల నుంచి వచ్చి 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచారు. ఆమె ప్రజాసేవ కన్నా వసూళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

Updated Date – Mar 23 , 2025 | 03:36 AM

Subscribe for notification