TGSRTC: సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ జేఏసీ.. సమస్యలుంటే చర్చలకు రావాలన్న సీఎం రేవంత్‌ – Telugu Information | CM Revanth Reddy urges TGSRTC employees to desist from launching indefinite strike

Written by RAJU

Published on:

ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్‌ మోగించింది. రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి మే 7వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే… ఈసారి సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదేలే లేదంటున్నారు జేఏసీ నేతలు. RTC పరిరక్షణ, ప్రభుత్వ హామీలు, విలీన ప్రక్రియ పూర్తి లాంటి 23 డిమాండ్‌లను తెలంగాణ ప్రభుత్వం ముందుంచారు. ఇక ఆర్టీసీ సమ్మెపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికులు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించాలన్నారు. సమ్మె ఆలోచన సరికాదన్న ఆయన. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.

ఇక సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ… తమకు సమ్మె చేయాలన్న ఆలోచన లేదంటోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకి వెళ్లాల్సి వస్తోందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలని కోరుతున్నారు. 2021 వేతన సవరణ చేయాలని.. అలాగే పెండింగ్‌ బకాయిలను సైతం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులను గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టీసీలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటున్నారు. ఇక.. సమ్మెకు ముందు మే 5న ఆర్టీసీ కార్మికుల కవాతు నిర్వాహిస్తామన్నారు జేఏసీ నేతలు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్‌ వరకు కార్మికుల కవాతు ఉంటుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్‌లకు ఒప్పుకుంటే మే7న సమ్మె ఉండదని చెబుతున్నారు.

మొత్తంగా.. చర్చలకు పిలిచి మే7లోపు తమ డిమాండ్లను నెరవేరిస్తే నో సమ్మె అంటున్నారు కార్మికులు. మరి చర్చలకు పిలిచి ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందా.? సమ్మె సమ్మె అంటున్న కార్మికులను శాంతింపజేస్తుందా…? అన్నది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.!

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights