కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పది రోజులుగా కర్రెగుట్టను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు.. రెండు గుట్టలను ఆధీనంలోకి తీసుకుని జాతీయ జెండా ఎగురవేశాయి. స్వాధీనం చేసుకున్న గుట్టలో శాశ్వత బేస్ క్యాంప్లు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
కర్రెగుట్టలో 20 వేల మందికిపైగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ లభించలేదు. దాంతో.. సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో మావోయిస్టు అగ్రనేతలంతా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టను వదలి మకాం మార్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
ఇదిలావుంటే.. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ ప్రజా సంఘాల ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. కూంబింగ్ ఆపి.. ఆదివాసీ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని.. తెలంగాణ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాలు శాంతి చర్చలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కర్రెగుట్టను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..