గిగ్‌ వర్కర్స్‌ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి

Written by RAJU

Published on:

గిగ్‌ వర్కర్స్‌ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి– ప్రతిపాదిత యాక్టులో మార్పులు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– కార్మిక శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 12న ప్రజల కోసం విడుదల చేసిన ”తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యాక్ట్‌ -2025”లో ప్రభుత్వం ప్రతిపాదించిన వాటిల్లో అనేక మార్పులు చేయాలనీ, వెల్ఫేర్‌ బోర్డులో కార్మిక సంఘాలకు కూడా స్థానం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. బోర్డు మీటింగ్‌ మూడు నెలలకోసారి జరపాలనీ, సమావేశానికి ముందే సభ్యులు ప్రతిపాదించే అంశాలను ఎజెండాలో చేర్చి చర్చించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్‌కు పలు అంశాలపై లేఖ అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌, ఉపాధ్యక్షులు వీఎస్‌. రావు, కోశాధికారి వంగూరు రాములు పాల్గొన్నారు. కోటిమందికిపైగా ప్రయోజనం చేకూరే ”తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు”లో కార్మిక సంఘాల ప్రతినిధులకు కూడా చోటు కల్పించాలని కోరారు. బోర్డు కాలపరిమితి మూడేండ్లకు కాకుండా రెండేండ్లకు కుదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మూడు నెలలకోసారి బోర్డు సమావేశమయ్యేలా చట్టంలో పొందుపర్చాలని సూచించారు. ”మెజారిటీ ఆఫ్‌ ఓట్స్‌” ప్రాతిపదికన నిర్ణయం అనేది సరిగాదని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డులో ప్రభుత్వ, యాజమాన్య ప్రతినిధులు, గిగ్‌ వర్కర్స్‌, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతరులు కూడా సమాన ప్రాతిపదికన ఉండేలా చూడాలని విన్నవించారు.
వారి అదనంగా చైర్మన్‌ ఉంటే ఓటింగ్‌ న్యాయంగా జరిగే అవకాశముంటుందని సూచించారు. సామాజిక భద్రత పథకాలు ఏమిటనే దానిపై స్పష్టతివ్వాలని కోరారు. ప్రతిపాదిత చట్టంలోని సెక్షన్‌-19 సబ్‌సెక్షన్‌(1)లో ప్రతిపాదించిన వెల్ఫేర్‌ ఫండ్‌ ఫీజును 1 శాతం, 2 శాతం కాకుండా 3 శాతానికి తగ్గకుండా అగ్రిగేటర్ల నుంచి వసూలు చేయాలని ప్రతిపాదించారు. సబ్‌ సెక్షన్‌ (2)లో ప్రతిపాదించేది కూడా సవరించి షెడ్యూల్‌-1లోని అగ్రిగేటర్ల నుండి కూడా ఎంత వెల్ఫేర్‌ ఫండ్‌ ఫీజ్‌ను వసూలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ ఆఫీసర్‌ ఇచ్చిన ఉత్తర్వులపై 90 రోజుల కాలపరిమితితో అప్పీల్‌ చేసుకోవాలని ప్రతిపాదించారనీ, అదే సమయంలో ఎంత కాలంలో పరిష్కరించాలనే దానిపై స్పష్టత ఇవ్వలేదని ఎత్తిచూపారు. ప్రతిపాదిత చట్టంలోని సెక్షన్‌-23లోని సబ్‌ సెక్షన్‌ (1)లో 100 మంది గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ పనిచేసే చోట మాత్రమే ”ఇంటర్నల్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ కమిటీ”ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించటం సరిగాదన్నారు. అనేక చట్టాలు 10/20 మంది కార్మికులు ఉన్న చోట అమలవుతున్న నేపథ్యంలో ఆ సంఖ్యను 10కిమార్చాలని కోరారు. ఇటీవల కాలంలో గిగ్‌ / ప్లాట్‌ఫామ్‌ కార్మికులపై కస్టమర్లు దాడి చేయటం, అవమానాలకు గురిచేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రస్తావించారు. ఆ రంగంలో మహిళా కార్మికులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వారికి సరైన రక్షణ కల్పించే విషయాన్ని చట్టంలో పొందుపర్చాలని కోరారు. వేతన సవరణ చేసే క్రమంలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలని విన్నవించారు. తమ సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదిత చట్టంలో పొందుపర్చాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights