Chiranjeevi Ashok Gajapathi Pension Controversy: రాజకీయాల్లోకి ( politics) వచ్చిన వారు సంపాదన కోసం వస్తుంటారు. మరికొందరు గౌరవం పెంచుకోవాలని వస్తుంటారు. ఇంకొందరు దర్పం ప్రదర్శించాలని వస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ రాజకీయం మాత్రం వేరు. అయితే నాలుగు డబ్బులు పోగేసుకోవాలన్న వారే అధికం. అదే సమయంలో నీతి నిజాయితీతో పని చేసేవారు కూడా ఉంటారు. రాజకీయం అంటేనే సేవ. అలా సేవ చేసేవారే రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ అదంతా గతం. ఇప్పుడంతా పైసా కే పరమాత్మ. డబ్బులు ఏ మార్గంలో వస్తాయా? ఎలా తీసుకుందామా? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన. అయితే అందర్నీ ఒకే గాటిన కట్టలేము కానీ.. ఎక్కువమంది బాపతు అదే. అయితే ప్రజల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో దుబారా వద్దని ప్రజా ప్రతినిధులు చెబుతుంటారు. కానీ వారి ప్రయోజనాల విషయంలో మాత్రం వాటి జోలికి వెళ్ళరు. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకున్నారని తెలియడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read : పులివెందులలో బిగ్ ఫైట్.. జగన్ కు కష్టమే!
రెండు చోట్ల పింఛన్లు..
చాలామంది రాజకీయాల్లోకి వచ్చాక ఎమ్మెల్యేలు అవుతుంటారు. ఎంపీలుగా కూడా వెళ్తుంటారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, వారి అభిరుచులకు తగ్గట్టు. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తుంటారు. అయితే అటువంటి వారంతా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల జీతభత్యాలు, పింఛన్లు అందుకుంటున్నారు. అయితే దీనిని తప్పు పట్టలేము కానీ.. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదో ఒక పింఛన్ తీసుకోవడం ఉత్తమం. అయితే ఒకే సమయంలో రెండు పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వాలు ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రజల విషయంలో చాలా రకాల చట్టాలను మార్పు తీసుకొచ్చారు. కానీ ప్రజాప్రతినిధుల పింఛన్లకు సంబంధించిన దుబారా ఖర్చు మాత్రం ప్రభుత్వాలకు కనిపించకపోవడం విశేషం.
ఏపీలో చాలామంది ప్రముఖులు..
మాజీ ప్రజాప్రతినిధుల కోటాలో ఏపీ నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారి జాబితాను సేకరించింది ఓ సంస్థ. మాజీ ఎమ్మెల్యేలు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. మాజీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను ఆరా తీసింది ఆ సంస్థ. అయితే ఇలా రెండు చోట్ల పింఛన్లు తీసుకున్న వారిలో ప్రముఖులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ) కూడా ఉన్నారు. తరువాత మెగాస్టార్ చిరంజీవి, టీజీ వెంకటేష్, నాదెండ్ల భాస్కరరావు.. ఇలా ప్రముఖులంతా రెండు ప్రభుత్వాల వద్ద పింఛన్లు పొందుతున్న వారే. అయితే అది నేరమని చెప్పలేము కానీ.. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు రెండు చోట్ల పింఛన్లు తీసుకోవడం ఏమిటనేది ప్రశ్న. అదే సమయంలో ప్రభుత్వాలు ఇటువంటి వాటి విషయంలో మార్పులు తీసుకొస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రముఖులంతా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారే. ఈ పింఛన్ అనేది వారికి చాలా చిన్న మొత్తం. వారికి తెలియకుండానే జరిగిపోయి ఉండవచ్చు. సాధారణంగా మాజీలుగా మారిన తర్వాత చాలామందికి ఇలా పింఛన్లు కొనసాగుతుంటాయి. అయితే ఇటువంటి ప్రముఖులు ఒకచోటే పింఛన్ తీసుకుని మిగతా వారికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.