Pahalgam Terrorist Home Blast: దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు పేల్చివేత!

Written by RAJU

Published on:

పహల్గామ్, ఏప్రిల్ 25: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టారు. భద్రతా బలగాలు ప్రస్తుతం బిజ్‌బెహరా, త్రాల్‌ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌లో లోకల్ టెర్రరిస్ట్‌ల నివాసాలపై దాడి చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని బందీపురా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. కుల్నార్‌ బాజీపురాలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్‌లోని మోంఘమా ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఇంటిని సైన్యం గుర్తించింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇంటిని బలగాలు పేల్చేశాయి. ఆ ఇల్లు ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌ లోయలో పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకలో ఆసిఫ్ షేక్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతడి కోసం ముమ్మర దర్యాప్తు జరుగుతుంది. సమాచారం ప్రకారం లష్కరే తోయిబా (LeT) స్థానిక కమాండర్‌గా ఆసిఫ్ షేక్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రాంగణంలో కొన్ని అనుమానాస్పద వస్తువులను గమనించారు. ప్రమాదాన్ని గ్రహించిన సిబ్బంది వెంటనే ఆ ప్రదేశం నుంచి వెనక్కి వెళ్లి.. ఆ తర్వాత కొద్దిసేపటికే భారీ పేలుడుతో ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ధ్వంసం చేసిన ఇంటిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.

పహల్గామ్‌లో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడిపై ప్రాథమిక దర్యాప్తులో పాల్గొన్న ఉగ్రవాదులు మొత్తం ఐదు నుంచి ఏడు వరకు ఉండవచ్చని, పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదుల సహాయంతో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బిజ్‌బెహారా నివాసి ఆదిల్ థోకర్ అలియాస్ ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాది కూడా ఉన్నట్లు బయటపడింది. ఉగ్రవాద దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా సంస్థలు కూడా విడుదల చేశాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు. వారికి మూసా, యూనస్, ఆసిఫ్ అనే కోడ్ పేర్లు ఉన్నాయి. వీరు పూంచ్‌లో ఉగ్రవాద సంబంధిత సంఘటనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పహల్గామ్ ఉగ్రదాడికి ఆర్టికల్ 370 రద్దు కారణమా?

ఏప్రిల్ 22న జరిగిన పహల్‌గామ్‌ ఉగ్రదాడితో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించగా, డజనుకు పైగా గాయపడ్డారు. కశ్మీర్‌ పొలీస్‌, ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ముష్కరులు.. లోడెడ్‌ తుపాకులను అమాయకులైన టూరిస్టులపైకి ఎక్కుపెట్టారు. పేర్లు, ఐడీ కార్డులు అడిగిమరీ చంపేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఇది ఒకటి. అయితే, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఎంతమంది మరణించారన్నది ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో భద్రతను మరింతపెంచారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతంలో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

పహల్‌గామ్‌ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. సౌదీ టూర్‌ మధ్యలో తిరిగొచ్చిన ప్రధాని ఎయిర్‌పోర్టులోనే ఘటనపై NSA అజిల్‌ దోవల్‌ నుంచి వివరణ తీసుకున్నారు. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకోనుంది. పహల్‌గామ్‌ దాడికి నెలరోజుల ముందే ఉగ్రవాదులు స్కెచ్‌ వేశారు. ఈనెల 1 నుంచి 7 వరకు పహల్‌గామ్‌లోనే కొన్ని హోటల్స్‌లో రెక్కీ కూడా నిర్వహించారు. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు అంచనా వేశారు. దాడి ఘటనపై NIA దర్యాప్తు చేస్తోంది. పహల్‌గామ్‌ సమీపంలో నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నా బైక్‌ని గుర్తించాయి భద్రతా బలగాలు. బైక్ మీద ఉగ్రవాదులు ప్రయాణించినట్టు అనుమానిస్తున్నారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో.. క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మీ, CRPF‌, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి.

ఉగ్రదాడిలో చనిపోయినవారి మృతదేహాలను విమానాల్లో తరలిస్తున్నారు. శవపేటికల్లో ప్యాక్ చేసి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు తెలుగువారు చనిపోయారు. వారిని విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరుకు చెందిన మధుసూదన్‌గా గుర్తించారు. డెడ్‌బాడీలను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పహల్‌గామ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కాపాడటానికి వచ్చిన జవాన్లను చూసి భయపడుతున్నారు. తమను చంపొద్దంటూ జవాన్లను వేడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights