అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. బొమ్మనహాళ్ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన వంశీ, గోవిందరాజులు సమ్మర్ హాలిడేస్ కావడంతో పొలం పనులకు వెెళ్లారు. అనంతరం ఎద్దుల బండితో ఇంటికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఎద్దులకు నీళ్లు తాగించడానికి ఓ నీటి కుంటవద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటివరకు బానే ఉన్న ఎద్దులు అకస్మాత్తుగా బెదిరి ఇద్దరు పిల్లల్ని కుంటలోకి లాక్కెళ్లాయి. నీటి కుంట లోతుగా ఉండటంతో ఎద్దుల బండితో పాటు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి ఊపిరి ఆడక మృతి చెందగా, ఒక ఎద్దు కూడా మరణించింది. 10వ తరగతి పరీక్షల్లో వంశీ పాసవ్వగా, గోవిందరాజులు ఓ సబ్జెక్టు తప్పడని గ్రామస్థులు తెలిపారు.
వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో చంద్రగిరి గ్రామంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మనహాళ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..