Pakistan ISI Behind Pahalgam assault NTV Unique

Written by RAJU

Published on:

Pakistan ISI Behind Pahalgam assault NTV Unique

కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ – TRF ప్రకటించింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ISI హస్తం ఉందనే సమాచారం అందుతోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని “స్థానిక తిరుగుబాటు”గా అభివర్ణించింది.

బైసరన్ మేడోస్.. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. కశ్మీర్ లో ఇదొక సుందరమైన పర్యాటక ప్రదేశం. కానీ ఇప్పుడీ ప్రాంతం తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లింది. పచ్చని ప్రదేశం నెత్తుటి మరకలతో భయానకంగా మారింది. ఏప్రిల్ 22, 2025.. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయం.. కమాండో యూనిఫామ్‌లలో ఉన్న సాయుధ ఉగ్రవాదులు ఈ ప్రదేశంలోకి చొరబడ్డారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి AK-47 కార్ట్ రిడ్జ్ లు, ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిగిన ప్రదేశం భద్రతా దళాల పరిధిలో లేదు. అందుకే టెర్రరిస్టులు కాల్పుల అనంతరం సులభంగా పారిపోయారు. స్థానిక ప్రజలు, పోనీవాలాలు గాయపడినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటాక్ తర్వాత తామే ఈ పని చేశామని ది రిసిస్టెన్స్ ఫ్రంట్ – TRF ప్రకటించింది. ఈ సంస్థకు లష్కర్-ఎ-తొయిబాతో పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వింగ్ – ISI ప్రత్యక్ష మద్దతు ఉందనే ఆరోపణలున్నాయి.

భారత్ లో ఏ దాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లో ఉండడం కొత్తేమీ కాదు. టెర్రరిస్టు దాడులు జరిగిన ప్రతిసారీ ISI హస్తం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తూనే ఉంది. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్- ISI మద్దతు ఇస్తోందనేది బహిరంగ రహస్యం. 2008లో ముంబై దాడులు, 2016 ఉరి దాడి, 2019లో పుల్వామా దాడి.. ఇలా చెప్పుకుంటూ పోతే ISI చేసిన దుర్మార్గాలు కోకొల్లలు. 2008 ముంబై దాడులలో డేవిడ్ హెడ్లీ సాక్ష్యం ISI , లష్కర్-ఎ-తొయిబా సంబంధాలను బహిర్గతం చేసింది. 2016 ఉరి దాడిలో ISI పాత్రను అమెరికా బహిర్గతం చేసింది. ఇది అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ISI ఆర్థికంగా, ఆయుధాల పరంగా సహాయం చేస్తోంది. అంతేకాక ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. పహల్గాం దాడిలో కూడా TRFకు ISI నేరుగా మద్దతు ఇచ్చిందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. స్థానికులను TRFలోకి రిక్రూట్ చేసి.. తద్వారా దాడులు చేయాలనేది ISI ఎత్తుగడ. అలా జరిగినప్పుడు దాన్ని స్థానిక తిరుగుబాటుగా చిత్రీకరించవచ్చనేది ISI ప్లాన్. పహల్గాంలో ఆ ప్లాన్ నే ఇంప్లిమెంట్ చేసినట్లు అర్థమవుతోంది.

TRF 2019లో మొదలైంది. అప్పటి నుంచి కశ్మీరీ హిందువులు, వలస కార్మికులు, స్థానిక రాజకీయ నాయకులు, పర్యాటకులపై దాడులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. TRF ప్రధాన సూత్రధారి షేక్ సజ్జాద్ గుల్. ఇతనే ఈ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. అయితే తాజాగా పహల్గాంలో జరిగిన దాడిలో లష్కరో తోయిబాకు చెందిన సైఫుల్లా సాజిద్ జట్ అనే కమాండర్ పాల్గొన్నట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. ఇతను ISIతో పాటు పాకిస్తాన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో శిక్షణ పొందుతున్నారని.. వాళ్లకు ISI నుంచి ఆయుధాలు, ఇంటెలిజెన్స్ సమాచారం అందుతోందని భారత భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. బైసరన్ దాడికి ముందు స్థానిక స్లీపర్ సెల్స్ సహాయంతో టెర్రరిస్టులు రెకీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ISI డీప్ నెట్‌వర్క్‌ కు ఇది నిదర్శనం.

అయితే అసలు ఈ దాడితో తమకు సంబంధమే లేదంటోంది పాకిస్తాన్. ఇదొక స్థానిక తిరుగుబాటు అని బుకాయిస్తోంది. పహల్గాం దాడిపై పాకిస్తాన్ స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఇదొక స్థానిక తిరుగుబాటు అని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని నాగాలాండ్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. హిందుత్వ శక్తులు మైనారిటీలను అణచివేస్తున్నాయని.. వాటిని తిప్పికొట్టేందుకు కొన్ని సంస్థలు తిరుగుబాటు చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్ ఇలా మాట్లాడడం కొత్తేమీ కాదు. 2008లో ముంబై దాడులు జరిగినప్పుడు కూడా ఇలాగే మాట్లాడింది. అజ్మల్ కసబ్‌ పాకిస్తాన్ కాదని, ఇండియన్ అని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పాకిస్తాన్ పౌరుడేనని అంగీకరించింది. పహల్గాం దాడిని స్థానిక సమస్యగా చిత్రీకరించడం ద్వారా అంతర్జాతీయ ఒత్తిడిని తప్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.

కశ్మీర్ లో ఎప్పుడు టెర్రర్ ఎటాక్ జరిగినా అది భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. అంతర్జాతీయ సమాజం ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోంది. కానీ పాకిస్తాన్ పై చర్యలకు మాత్రం ముందుకు రావట్లేదు. పహల్గాం దాడి ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించి దేశానికి తిరిగి వచ్చేశారు. హోం మంత్రి అమిత్ షా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అంతర్జాతీయ ఫోరంలలో పాకిస్తాన్ ప్రమేయాన్ని నిర్ధారించేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, రష్యా తదితర దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. అయితే, అంతర్జాతీయ సమాజం ఈ దాడిని ఖండించినప్పటికీ, పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో ఏకాభిప్రాయానికి రావట్లేదు. ఇది భారత్ కు ఇబ్బందికరంగా మారుతోంది.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కశ్మీర్ లో ఈ దాడి భయాందోళనకు కారణమైంది. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా కశ్మీర్ అందాలను చూసిన పర్యాటకులు, ఇప్పుడు అక్కడ అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పహల్గాం దాడి కశ్మీర్‌లోని పర్యాటక రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో పర్యాటకం గణనీయంగా పెరిగింది. అయితే ఈ దాడి తర్వాత పర్యాటకులు భయాందోళనలతో పహల్గాం నుంచి తిరుగుముఖం పడుతున్నారు. పర్యాటకులు లేకపోతే స్థానిక వ్యాపారులు, హోటల్ యజమానులు, పోనీవాలాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమర్‌నాథ్ యాత్రకు ముందు ఈ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కశ్మీరీ సమాజంలో ఈ దాడి భయం కలిగించింది. అభద్రతాభావాన్ని సృష్టించింది.

అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ పనిచేస్తే వెంటనే దాని అంతు చూసే వరకూ అగ్రదేశం నిద్రపోదు. ప్రపంచంలో ఏమూల దాగి ఉన్నా అక్కడికెళ్లి మట్టుబెడుతుంటుంది. ఇప్పుడు ఇండియా కూడా అలాగే చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. We want revenge అనే స్లోగన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ISI లింకులను బయటపెట్టడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టాలనేదే భారత ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో గతంలో లాగా సర్జికల్ స్ట్రయిక్స్ చేసేందుకు కూడా వెనకాడకపోవచ్చని సమాచారం.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights