- చౌకబారు రాజకీయాలు మానుకోండి.
- కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.

MP Laxman: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందన్నారాయన. కాంగ్రెస్ నేతలు CWC సమావేశంలో దాడి ఘటనను పొలిటికల్ ఈవెంట్‌లా మార్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. భద్రతా సమస్యపై అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ పూనుకుంటోందని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ కొత్తది కాదని, ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారని అన్నారు. అలాంటి నేతలకు భారత భద్రతపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.
అలాగే కాంగ్రెస్ నేతలు హిందువులపై దాడులను నెపంగా చూపించి ‘సాఫ్రాన్ టెర్రరిజం’ అంటూ మాట్లాడినవాళ్లే.. ఇప్పుడేమిటో ‘ఇస్లామిక్ టెర్రరిజం’, ‘జిహాదీ టెర్రరిజం’ అనే పదాలను ఉపయోగించేందుకు కూడా భయపడుతున్నారని విమర్శించారు. రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదాన్ని సమర్థించేలా ఉన్నాయని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ అతని వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కావాల్సినప్పుడు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో మాత్రం నోరు మెదపకపోవడమేమిటని ఆయన అన్నారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో చురుగ్గా ఉండే కేటీఆర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్‌కు సహకరించారని అన్నారు. చివరగా కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, దేశ భద్రత వంటి సున్నిత అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.