CM Chandrababu Naidu: ఆ కిరాతకులను వదలం

Written by RAJU

Published on:

భూగర్భంలో దాక్కున్నా పట్టుకుని శిక్షిస్తాం.. హత్యా రాజకీయాలను సహించేది లేదు

టీడీపీ నేత వీరయ్య హత్య కలచివేసింది: చంద్రబాబు.. మృతుడి స్వగ్రామంలో నివాళి

ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో పర్యటన.. అండగా ఉంటామని కుటుంబానికి భరోసా

అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు, నేతలు.. అన్ని కోణాల్లో ముమ్మరంగా కేసు దర్యాప్తు

పోలీసుల అదుపులో వైసీపీ రౌడీషీటర్‌.. పొన్నూరులో మరో ముగ్గురు

ఒంగోలు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలతో రాష్ట్రం వణికిపోయిందని, తమ ప్రభుత్వంలో ఆ తరహా చర్యలను సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని కిరాతకంగా హత్య చేసిన వారిని వదిలిపెట్టబోమని, హంతకులు భూమిలో దాక్కున్నా పట్టుకుని శిక్షించి తీరుతామని అన్నారు. మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి దారుణ హత్యోదంతంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు బుధవారం చంద్రబాబు వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మృతుడి భార్య, కుమారుడు, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్యకు సంబంధించిన విషయాలను పోలీస్‌ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌తో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కోసం వీరయ్యచౌదరి అహర్నిశలు పనిచేశారన్నారు. గత ఎన్నికలలో సంతనూతలపాడు, చీరాల నియోజకవర్గాలలో టీడీపీ గెలుపునకు విశేష కృషిచేసిన వీరయ్య హత్యకు గురికావడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను హత్య చేసిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఇలాంటి క్రూరులు ఉన్నారా అని బాధ వేస్తోందన్నారు.

gtkh.jpg

కూటమి ప్రభుత్వంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో ప్రకాశం జిల్లాకు వచ్చారు. చదలవాడ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగి అక్కడి నుంచి కాన్వాయ్‌లో అమ్మనబ్రోలు వెళ్లారు. ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ ప్రాథమికంగా హత్యకు సంబంధించిన అంశాలను బస్సులో సీఎంకు వివరించారు. మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామి, జిల్లా నాయకులను కూడా సీఎం వాకబు చేశారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు

మంగళవారం రాత్రి ఒంగోలులో హత్యకు గురైన వీరయ్యచౌదరి మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు. బుధవారం 12 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించి ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలు తరలించారు. మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బీఎన్‌ విజయకుమార్‌, దామచర్ల జనార్దన్‌, అశోక్‌రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ తదితరులు ఆస్పత్రికి వచ్చారు. తొలుత ఎంపీ మాగుంట కార్యాలయంలో వారు భేటీ అయి వీరయ్య హత్య, తదనంతర పరిణామాలపై చర్చించారు. బుధవారం జరగాల్సిన డీఆర్సీ సమావేశాన్ని రద్దు చేసుకొని అమ్మనబ్రోలు వెళ్లి వీరయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో వేలాది మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొని వీడ్కోలు పలికారు.

అన్ని కోణాల్లో విచారణ: హోం మంత్రి అనిత

వీరయ్యచౌదరి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆయనకు చెందిన బియ్యం, లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలపై దృష్టిపెట్టారు. ఆ కోణంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీకి చెందిన రౌడీషీటర్‌, రేషన్‌ బియ్యం మాఫియా డాన్‌గా పేరొందిన హతుడి బద్ధ వ్యతిరేకిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బెంగళూరు, రామాయపట్నం తదితర ప్రాంతాల్లో వీరయ్యకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార లావాదేవీల అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. వీరయ్య హత్యను టీడీపీ అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రికే హోంమంత్రి అనిత ఒంగోలు వచ్చి బుధవారం సాయంత్రం వరకు ఉండి దర్యాప్తును సమీక్షించారు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరయ్య రాజకీయ నాయకుడు అయినప్పటికీ వ్యాపార రంగంలో కూడా బాగా రాణించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలులో వ్యతిరేకులుగా ఉన్న వారిని కూడా వివిఽధ కోణాల్లో పోలీసులు విచారించారు. నాగులుప్పలపాడు మండలంలో రాజకీయంగా వీరయ్యకు వ్యతిరేకంగా ఉన్న, వైసీపీకి చెందిన ఒక రౌడీషీటర్‌పై పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి అతని కోసం గాలించగా, బుధవారం మధ్యాహ్నం పోలీసులకు అందుబాటులోకి వచ్చినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే అండదండలతో రేషన్‌ బియ్యం మాఫియా డాన్‌గా ఉన్నారు. విదేశీ మద్యం అక్రమంగా తెప్పించి వ్యాపారం చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.

పొన్నూరులో ముగ్గురు అదుపులోకి

పొన్నూరు టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యకేసులో ప్రకాశం జిల్లా పోలీసులు ముగ్గురు అనుమానితులను గుంటూరు జిల్లా పొన్నూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరయ్య హంతకులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన కొద్ది సేపటికే వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రాంతానికి చెందిన గోపి, అమీర్‌, అశోక్‌ అనే ముగ్గురు యువకులను ఒంగోలు తరలించినట్లు తెలుస్తొంది. ఈ అనుమానితులు స్వయంగా హత్యలో పాల్గొన్నారా? లేక హత్య కేసు నిందితులకు సహకరించారా? అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీరయ్య హత్య రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మాఫియా నేపథ్యంలో జరిగిందనే అనుమానాలున్న నేపథ్యంలో పొన్నూరు రేషన్‌ మాఫియా పేరు మరోమారు చర్చనీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పొన్నూరు పట్టణానికి చెందిన అంజి బర్ణబాసు అనే రేషన్‌ బియ్యం వ్యాపారి హత్య అప్పట్లో సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో వైసీపీకి చెందిన కీలక నాయకులు ఉన్నారని హతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా చేబ్రోలు అర్బన్‌ పోలీసులు కూడా మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఓ వ్యక్తి బర్ణబాసు హత్య కేసులో నిందితుడు కాగా, మరో వ్యక్తి చింటూ అని సమాచారం.

Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ…

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights