Pawan Kalyan Case: నేడు హైకోర్టు ముందుకు పవన్ కేసు!

Pawan Kalyan Case: విపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan) వలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాలంటీర్లు సేకరించిన డేటా కారణంగా.. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వారాహి యాత్ర సందర్భంగా అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న అలా అదృశ్యం అయినా అమ్మాయిల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై గతంలో గుంటూరు కోర్టులో దాఖలైన కేసును వెనక్కి తీసుకుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు హైకోర్టుకు చేరుకుంది. కేసు రీఓపెన్ తో పాటు విచారణకు సైతం ఈ పిటిషన్ సిద్ధమైంది. దీంతో కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read: గెలుపు తనదని ఇంగ్లాండ్ అనుకుంది.. అదే మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పింది!

* వారి ద్వారానే డేటా చోరీ
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించింది. పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను అప్పగించింది. అయితే అప్పట్లో వలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వలంటీర్లంతా ఆ పార్టీ సానుభూతిపరులు కావడంతో సార్వత్రిక ఎన్నికల్లో సైతం వారితోనే గెలుపొందాలని వ్యూహరచన చేసింది. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్షాలకు వలంటీర్లు టార్గెట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది మహిళల మిస్సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు డేటా సేకరణ మూలంగానే వారంతా అదృశ్యమయ్యారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ పరువుకు భంగం కలిగించాయంటూ వాలంటీర్లు చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదు అయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది నవంబర్లో కోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల్లో వలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ రిజిస్ట్రీ వీరి పిటిషన్కు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వారు నేరుగా న్యాయమూర్తిని ఆశ్రయించడంతో నెంబర్ కేటాయించారు.

* తీర్పుపై ఉత్కంఠ..
మరోవైపు ఈ కేసు ఈరోజు రీఓపెన్ చేయడంతో పాటు విచారణ చేపడతామని కూడా హైకోర్టు( High Court) స్పష్టం చేసింది. అయితే కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందా? అన్నది చర్చనీయాంసమైంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా చాలా కీలకం. పవన్ చేసిన తీవ్ర ఆరోపణ వెనుక ఉన్న ఆధారాలు హైకోర్టు ముందుకు రావాల్సి ఉంటుంది. అలా కాకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కు ఈ వ్యవహారంలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఆధారాలు లేకుండా పవన్ వ్యాఖ్యలు చేసినట్లు తేలితే హైకోర్టు ఆయన పై చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కీలకంగా మారబోతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి సైతం మరో భయం వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు ఉపసంహరించుకోవడం వెనుక ఉన్న కారణాలను హైకోర్టులో సమర్ధించుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే ఈ కేసు తదుపరి విచారణకు హైకోర్టు అనుమతించే అవకాశం కూడా ఉంది. ఇలా ఎలా చూసుకున్నా ఈ కేసు ఇప్పుడు కీలకంగా మారడం విశేషం.

Leave a Comment