కేటీఆర్‌కు ఊరట

Written by RAJU

Published on:

కేటీఆర్‌కు ఊరట– రెండు కేసులను కొట్టేసిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావుకు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. రెండు వేర్వేరు కేసులను కొట్టేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్‌ కె లక్ష్మణ్‌ వేర్వేరు తీర్పులను వెలువరించారు. మేడిగడ్డ సందర్శన సమయంలో డ్రోన్‌ వివాదంపై మహదేవ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో, సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారంటూ ఆదిలాబాద్‌ ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన రెండు కేసులను కొట్టేశారు. ఆ కేసులను కొనసాగిస్తే న్యాయ ప్రక్రియను దుర్వినియో గం చేయడమేనన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లినప్పుడు డ్రోన్‌ ఎగురవేశారని 2024 జులై 29న మహదేవ్‌పూర్‌ పోలీసులు కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లపై కూడా డ్రోన్‌ ఎగురవేత కేసు నమోదైంది. వాటిని కొట్టేయాలంటూ వాళ్లు వేసిన పిటిషన్లను అనుమతిస్తూ న్యాయమూర్తి లక్ష్మణ్‌ తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయలేదన్నారు. అదనపు ఆరోపణ చేస్తూ మెమోను దాఖలు అన్యాయమని అన్నారు. సాక్షులందరూ ఒకే రకమైన వాంగ్మూలం ఇచ్చారని చెప్పారు. ఏర్‌క్రాఫ్ట్‌ చట్టం కింద మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయకపోయినా ఆ చట్టం కింద కేసు నమోదు చెల్లదన్నారు. ఏర్‌క్రాఫ్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 10ఏ ఉల్లంఘనకు సంబంధించి జరిమానా విధించాల్సి ఉందనీ, దాన్ని విధించే పరిధి కేంద్రానిదని చెప్పారు. కేటీఆర్‌ పర్యటించిన మూడు రోజలకు ఇరిగేషన్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ తప్పపట్టారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌పై ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీసులు పెట్టిన మరో ఎఫ్‌ఐఆర్‌ను కూడా న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ కొట్టేస్తూ తీర్పు చెప్పారు. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్‌ పార్టీకి చేరాయటూ బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలోనూ, కిషన్‌బాగ్‌లోనూ కేటీఆర్‌ ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీనిపై ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబరు 30న కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్‌ సవాలు చేశారు. ఫిర్యాదులోని అంశాలకు ఆధారాల్లేవనీ, ఇలాంటి ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించేందుకు వీల్లేదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం
ఆర్థిక అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆర్థిక పరమైన విధాన నిర్ణయాలను తీసుకోవద్దని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సిబ్బంది వేతనాలు, రోజువారీ ఖర్చులు చేసుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది. హెచ్‌సీఏ మేనేజింగ్‌ కమిటీ ఆర్థిక అవినీతిపై తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారించారు. మేనేజింగ్‌ కమిటీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందనీ, అర్హతలు లేకపోయినా వాస్తవాలను గోప్యంగా ఉంచి ఎన్నికల్లో పోటీ చేసిన కమిటీ అక్రమాలను అడ్డుకోవాలని పిటిషనర్‌ వాదించారు. ప్రస్తుతం మేనేజింగ్‌ కమిటీ ఇటీవల ఎన్నిక అయ్యిందనీ, గత మేనేజింగ్‌ కమిటీపై అభియోగాలున్నాయని హెచ్‌సీఏ వాదించింది. దీనిపై హైకోర్టు మేనేజింగ్‌ కమిటీపై ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి ఆర్థిక నిర్ణయాలను తీసుకోవద్దని ఉత్తర్వులను జారీ చేస్టున్నట్టు ప్రకటించింది. విచారణను జూన్‌ 16వ తేదీకి వాయిదా వేసింది.
లగచర్ల రైతులపై 2 ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేత ఒకటే ఉంచాలన్న హైకోర్టు
వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణ సందర్భంగా అధికారులపై రైతులు దాడి చేశారనే అభియోగాలపై బొమ్రాస్‌పేట పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు కొట్టేసింది. తొలుత బొమ్రాస్‌పేట పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ (నెంబర్‌ 153) కిందనే కేసు విచారణ చేయాలంది. ఒక ఎఫ్‌ఐఆర్‌పైనే దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. మరో రెండు ఎఫ్‌ఆఐర్‌లు 154, 155 చెల్లవ ని జస్టిస్‌ కె లక్ష్మణ్‌ సోమవారం తీర్పు చెప్పారు. ఒకే సంఘటనకు సంబంధిం చి వేర్వేరు కేసులు నమోదు చేయడం సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకమనీ, అందుకే తొలి ఎఫ్‌ఐఆర్‌ను మాత్రమే అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల కింద ఎవరివైనా వాంగ్మూలాలను రికార్డు చేసుంటే వాటిని తొలి ఎఫ్‌ఐఆర్‌లో పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ చట్టంపై హైకోర్టులో పిటిషన్‌ వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసు
ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ కె మంగ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆకాష్‌ బాగ్లేకర్‌ వాదనలు వినిపిస్తూ దేవిందర్‌సింగ్‌ కేసు లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్‌ వర్తింపజ ేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights