సమ్మర్ కేర్
వేసవిలో చర్మ సమస్యలు సర్వసాధారణం. అలాగని వాటిని నిర్లక్ష్యం చేస్తే, ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎండ వేడి నుంచి చర్మాన్ని రక్షించుకునే ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు.
సూర్యరశ్మిలోని పరారుణ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు మన చర్మాన్ని ఎంతో కొంత దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా సున్నిత చర్మం కలిగిన వాళ్లకు ఈ సమస్యలు మరింత ఎక్కువ. దాంతో ఎండకు చర్మం నల్లబడడం, కమిలిపోవడం, గాయపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని నివారించుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం!
చమట పొక్కులకు విరుగుడు
ఈ కాలంలో దురదలు, ఉబ్బెత్తు పొక్కులతో చమట పొక్కులు వేధించడం సహజం. ఎక్కువ చమట పడుతున్నా, చమట శరీరం మీదే ఆరిపోయినా, చమట పీల్చుకోలేని, బిగుతైన దుస్తులు వేసుకున్నా చమట పొక్కులు తప్పవు. మెడ, బాహుమూలలు, ఛాతీ, వెన్నులో ఎక్కువగా చమట పొక్కులు తలెత్తుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సూర్యరశ్మిని తట్టుకోలేని సున్నిత చర్మం కలిగి ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు గురి కాకుండా ఉండాలంటే….
గాలి చొరబడే, చమట పీల్చే నూలు దుస్తులు వేసుకోవాలి
రోజుకు రెండు నుంచి మూడు సార్లు చల్లనీటి స్నానం చేయాలి
చర్మం మీద చమట ఆరిపోకుండా చూసుకోవాలి
ప్రతిసారీ సబ్బుతో రుద్ది స్నానం చేయకుండా ఒకట్రెండు సార్లు చల్ల నీళ్లతో ఒంటిని శుభ్రం చేసుకోవాలి
బిగుతైన దుస్తులు వేసుకోకూడదు
లేత రంగు దుస్తులే ఎంచుకోవాలి
శరీర శుభ్రత పాటించాలి

చికిత్స ఇలా…
మందుల షాపుల్లో దొరికే క్యాలమైన్ లోషన్‌ను పైపూతగా వాడుకోవచ్చు. అలాగే దురదలు పెడుతున్నప్పుడు గోళ్లతో గోక్కోకూడదు. ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ చమట పొక్కులు అదుపులోకి రాకుండా పెద్ద పుండ్లుగా మారితే చర్మ వైద్యులను ఆశ్రయించాలి. దురదను తగ్గించే లోషన్లు, యాంటీ హిస్టమిన్ మందులతో చమట పొక్కులు సులువుగా అదుపులోకొస్తాయి.
సున్నిత చర్మంతో సమస్యలు
సాధారణంగా సున్నిత చర్మం కలిగిన వాళ్లు వేసవి వేడి, ఎండలకు మరింత ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ కోవకు చెందిన వాళ్లు వేసవిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండకు బహిర్గతం కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ సమయాల్లో ఎండలోకి వెళ్తే నుదురు, మెడ, ఛాతీ, ముంజేతులు ఇలా ఎండకు బహిర్గతమయ్యే ప్రదేశాల్లో చర్మం కమిలిపోతుంది. దురద కూడా వేధిస్తుంది. ఇలాంటివారు ఈ జాగ్రత్తలు పాటించాలి
ముంజేతులు, మెడలను కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి
ఆరుబయట తిరిగే సమయాలను తగ్గించుకోవాలి
ఆరుబయట ఈతకొలనుల్లో ఈతకు వెళ్లేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలి
బయటకు వెళ్లేటప్పుడు 30 ఎస్‌పిఎఫ్ మించిన సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలి
ప్రతి నాలుగు గంటలకూ సన్‌స్ర్కీన్స్ పూసుకుంటూ ఉండాలి
తలకు టోపీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు వాడుకోవాలి
పిగ్మెంటేషన్ సమస్యలు
వేసవిలో ఎండకు ముందు నుంచీ ఉన్న మంగు సమస్య మరింత తీవ్రమవుతుంది. లేదంటే కొత్తగా మంగు సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఈ కాలంలో తప్పనిసరిగా తగిన రక్షణ చర్యలు పాటించాలి. కళ్ల చుట్టూ చర్మం నల్లబడిపోకుండా చలువ కళ్లద్దాలు ఉపకరిస్తాయి.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు
ఈ కాలంలో కటి ప్రదేశంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ముప్పు కూడా ఎక్కువే! ప్రత్యేకించి ఎక్కువ సమయాల పాటు ఆరుబయట గడిపేవారు, వ్యాయామాలు చేసేవారు ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకుండా సేద తీరుతూ ఉండిపోతారు. ఇలాంటి సందర్భాల్లో, చమట పట్టిన ప్రదేశాల్లో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే చర్మ రంథ్రాల నుంచి వెలువడే చర్మపు నూనెలు, చమట కలిసి ఎగ్జిమా సమస్యను కూడా పెంచుతాయి.
వేసవి ఆహారం
ఈ కాలంలో చర్మపు ఆరోగ్యం కోసం పైపూతలు, ఎండను, వేడిని అడ్డుకునే జాగ్రత్తలు పాటించడంతో పాటు తగిన ఆరోగ్య నియమాలు కూడా పాటించాలి. అవేంటంటే…
దానిమ్మ, గుమ్మడి, పుచ్చ, క్యారెట్, క్యాప్సికమ్ లాంటి ఎరుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి
నీళ్లకే పరిమితం కాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి
పండ్ల రసాలకు బదులుగా పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి
శీతల పానీయాలు, చక్కెర కలిసిన పండ్ల రసాలు తాగకూడదు
నూనెలో వేయించిన పదార్థాలు బాగా తగ్గించాలి
చర్మపు అలర్జీలు
ఎగ్జిమా పొడి వాతావరణంలోనే తీవ్రమవుతూ ఉంటుంది. కానీ అరుదుగా కొందర్లో వేసవిలో ఎక్కువ చమట పట్టినప్పుడు, ముందు నుంచీ అలర్జీ తత్వం కలిగి ఉన్నప్పుడు ఎగ్జిమా వేధిస్తుంది. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడం కోసం నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడుకోవాలి. అవసరానికి మించి సబ్బును ఉపయోగించడం వల్ల సహజసిద్ధ చర్మపు నూనెలు తొలగిపోతాయి కాబట్టి సబ్బు పరిమితంగా వాడుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత తడి లేకుండా టవల్‌తో శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే దుస్తులు వేసుకోవాలి. మరీ ముఖ్యంగా కాలి వేళ్లు, బాహుమూలలు, కటి ప్రదేశాల్లో తడి లేకుండా చూసుకోవాలి.
-డాక్టర్ హర్షిత రెడ్డి బొందుగుల
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్,
అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్
ఇవి కూడా చదవండి:
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
Read Latest and Health News