MLA disqualification case: భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన తీర్పు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి తెగ ఉత్సాహపడుతున్నప్పటికీ.. వారి ఉత్సాహానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు వేగంగా నడుచుకోలేకపోయింది. తన పరిధిలో తీర్పు మాత్రమే ఇచ్చింది. అంతిమంగా ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే అంతిమంగా బంతిని స్పీకర్ కోర్టులో వేసింది.
Read Also: ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రాంగం.. ఏంటి కథ?
ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నిర్ణయం తీసుకుంటారా.. అది అసలు సాధ్యపడదు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ గా శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి టిడిపిని, కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసింది. అసలు శాసనసభలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసింది. నిండు శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. “వాళ్లంతట వాళ్ళు మా పార్టీలోకి వస్తే మేము ఏం చేయగలం.. వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను వారే కాపాడుకోవాలి” అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే గులాబీ దళపతి ఆధ్వర్యంలో పార్టీ అనర్హత వేటు విధించాలని కోరుతోంది. దీనినే దెయ్యాల వేదాలు వల్లించడం అంటారేమో. రెండు పర్యాయాలు భారత రాష్ట్ర సమితి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాదు.. అంతకుముందు కాంగ్రెస్ వల్ల బాధిత పక్షం లాగా మారిపోయింది. దుగ్యాల శ్రీనివాసరావు వంటి ఎమ్మెల్యేలు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు.. అప్పట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై భారత రాష్ట్ర సమితి ఈ స్థాయిలో గనుక ఆందోళన సాగిస్తే.. పరిస్థితి మరో విధంగా ఉండేదేమో.
Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్పీకర్ ఏం చేస్తారు?
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కాబట్టి.. భారత రాష్ట్ర సమితి కోరుకున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశించడానికి లేదు. ఎందుకంటే చట్టంలో లొసుగులు చాలానే ఉన్నాయి. పైగా స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. అలాంటప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా..ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని.. అందులో గెలుస్తామని భారత రాష్ట్ర సమితి ఆశపడుతోంది గాని.. అలాంటి సన్నివేశం ఇప్పుడే కాదు ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే గత భారత రాష్ట్ర సమితి ఇతర పార్టీలో చెందిన ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే తమ పార్టీలో చేర్చుకుందో.. అదేవిధంగా తాము కూడా ఆ పార్టీ చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏతా వాతా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో, తన అనుకూల మీడియాలో గొప్పగా చెప్పుకోవచ్చు.. కానీ అలాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వడు. ఇచ్చే అవకాశం కూడా లేదు. కొద్ది రోజులపాటు దీని గురించి గులాబీ నేతలు గాయిగత్తర చేస్తారు. ఇప్పుడెలాగూ స్థానిక ఎన్నికలు లేవు కాబట్టి.. భారత రాష్ట్ర సమితికి కాస్త టైంపాస్.. అంతే అంతకుమించి ఏమీ లేదు..