Pulivendula By-Election: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లు లభించాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో చాలామంది నేతలు భవిష్యత్తుపై బెంగతో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం కేసులతో వెంటాడుతోంది. కీలక నేతల పై కేసులు నమోదవుతున్నాయి. ఆపై అరెస్టుల పర్వం కూడా నడుస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుందని ప్రచారం ప్రారంభమైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో అక్కడ గట్టెక్కాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఖాళీలకు ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. కడప జిల్లాలో రెండు జెడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!
రెండు స్థానాలకు ఉప ఎన్నికలు
కడప జిల్లా ( Kadapa district) ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2021లో ఇక్కడ నుంచి జడ్పిటిసి గా పోటీ చేసి గెలిచారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేవారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో జడ్పిటిసి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మరోవైపు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మండల జడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆ స్థానానికి సైతం ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
Also Read: పెద్దిరెడ్డిపై ఇంత పగేంటి ‘బాబు’’
ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకమే..
అయితే ఇది ఒక విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో( Y S Jagan Mohan Reddy ) పాటు కూటమి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష. సాధారణంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పులివెందులలో పట్టు ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. మరోవైపు జిల్లాలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింటిని పోగొట్టుకుంది. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది. అయితే కూటమి దూకుడు మీద ఉంది. ఆపై మూడు పార్టీలు ఉమ్మడిగా కృషి చేస్తే తప్పకుండా ఇక్కడ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో మంచి మెజారిటీతో విజయం సాధించడం ద్వారా కూటమి బలం తగ్గలేదని సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలంటే తప్పకుండా సమన్వయంతో పని చేయాలని కడప నేతలంతా ఏకతాటి పైకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.