CM Chandrababu: వక్ఫ్‌ జోలికి ఎందుకెళ్లారు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 10 , 2025 | 05:04 AM

వక్ఫ్‌ భూములను వాణిజ్య అవసరాలకు కట్టబెట్టే ప్రయత్నాలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ముస్లిం సంక్షేమం కోసమే వక్ఫ్‌ భూములు ఉపయోగించాలని స్పష్టంగా ఆదేశించారు

CM Chandrababu: వక్ఫ్‌ జోలికి ఎందుకెళ్లారు

CM Chandrababu Naidu

  • ఆ భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని చెప్పానా? లేదా?

  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

  • ‘ఆంధ్రజ్యోతి’ వార్తలోని అంశాలపై ఆరా

  • ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పరా?

  • నోటిఫికేషన్‌ రద్దుకు ఆదేశాలు

  • ఆ వెంటనే రంగంలోకి దిగిన సీఎంవో

  • మైనారిటీ సంక్షేమశాఖ నుంచి వివరణ

  • ప్రకటనను ఉపసంహరించాలంటూ వక్ఫ్‌బోర్డుకు ఆ శాఖ కార్యదర్శి ఆదేశం

  • నలుగురు కాదు.. 50 మంది ఇంటి దొంగలు.. అందరినీ ఏరేస్తాం: చైర్మన్‌

అమరావతి, ఏప్రిల్‌ 9 ఆంధ్రజ్యోతి): వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములను వాణిజ్య అవసరాలకు కట్టబెట్టే ప్రయత్నాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి మాత్రమే ఆ భూములను ఉపయోగించాలని లోగడ సీఎం ఆదేశించారు. అయినా, ప్రభుత్వానికి మాటమాత్రమైనా చెప్పకుండా వాణిజ్య అవసరాలకు ఇచ్చేందుకు నోటిఫికేషన్‌ను ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆసక్తిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఈనెల 3వ తేదీన వక్ఫ్‌బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దుచేయాలని ఆయన ఆదేశించారు. వక్ఫ్‌ భూములను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమశాఖకు నిర్దేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో, ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని వక్ఫ్‌బోర్డును ఆదేశించినట్లుగా మైనారిటీ సంక్షేమశాఖ బుధవారం ప్రకటించింది. ‘వక్ఫ్‌భూములకు ఎసరు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే. ఓ కీలక అధికారిని ముఖ్యమంత్రి పిలిచి ఈ వార్తపై వివరణ కోరారని తెలిసింది. ‘‘డిసెంబరులో జరిగిన సమావేశంలో వక్ఫ్‌ భూముల గురించి స్పష్టత ఇచ్చాను. ముస్లిం వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికే ఆ భూములు ఉపయోగించాలని, వ్యాపారాలకు తావులేదని ఆదేశించాను. నాకు తెలియకుండా ఆ భూముల జోలికి ఎందుకు వెళ్లారు? వక్ఫ్‌బోర్డు ఇచ్చిన నోటీసు గురించి మైనారిటీ సంక్షేమశాఖ నివేదించిన విషయాన్ని కూడా నాకు ఎందుకు చెప్పలేదు? ఆ శాఖ ఇచ్చిన సమాచారంపై తక్షణమే స్పందించి ఆ నోటీసు ఎందుకు రద్దుచేయలేదు? సంబంధిత వ్యక్తులను ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయారు? ఇదేం పద్ధతి? వక్ఫ్‌భూముల్లో గజం భూమి చేయిదాటినా ఊరుకునేది లేదు.

తక్షణమే ఆ శాఖ అధికారులను పిలిచి మాట్లాడండి. వక్ఫ్‌బోర్డు సీఈవో ఎవరిని అడిగి ఆ నోటీసు ఇచ్చారు? మైనారిటీ శాఖ మంత్రి, కార్యదర్శికి సమాచారం ఎందుకు ఇవ్వలేదు? పిలిచి మాట్లాడండి. వెంటనే ఆ నోటీసును రద్దుచేయండి. భూముల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి’’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం సీఎంవో…. మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. తర్వాత పలు పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ‘ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి, ఆమోదం లేకుండా వక్ఫ్‌బోర్డు సీఈవో నోటీసులు ఇవ్వడం సముచితం కాదు’’ అని మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు సీఎంవోకు నివేదించినట్లు తెలిసింది. మైనారిటీ సంక్షేవశాఖ కార్యదర్శి చిత్తూరు శ్రీధర్‌ ఓ ప్రకటన జారీ చేశారు వక్ఫ్‌బోర్డు ఇచ్చిన వాణిజ్యప్రకటనను ఉపసంహరించాలని ఆదేశించినట్లు వివరించారు. కాగా, వక్ఫ్‌ భూములను కాజేసే ఇంటిదొంగలు 50మంది ఉన్నారని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ వెల్లడించారు. ఇంటిదొంగలను గుర్తించి ఏరిపారేస్తామని ప్రకటించారు. హిందూ ఆలయాల ఆస్తులు ఎలా కాపాడతారో, వక్ఫ్‌ ఆస్తులనూ అలాగే కాపాడాలని సీఎం చెప్పారని తెలిపారు. వక్ఫ్‌ భూములపై నలుగురు ఇంటిదొంగలు కన్నేశారని ‘ఆంధ్రజ్యోతి’ తన వార్తలో పేర్కొంది. అయితే, అంతకుమించి దొంగలు ఉన్నారని ఆయన కొత్త సంగతి చెప్పారు. మరి ఆ దొంగలను ఎలా గుర్తిస్తారు.. ఎలా ఏరివేస్తారనేది వక్ఫ్‌బోర్డుకే స్పష్టత ఉండాలి.

Read Latest AP News And Telugu News

Updated Date – Apr 10 , 2025 | 08:54 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights