- భారత్ నిర్ణయంతో మాపై ప్రభావం ఉండదు: బంగ్లాదేశ్..
- ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసిన భారత్..
- బంగ్లాదేశ్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం..

Bangladesh: బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం ద్వారా ఆ ప్రాంతానికి విస్తరించవచ్చని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ సీరియస్‌గా తీసుకుంటోంది. చైనా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో, పరోక్షంగా భారత్‌ని దెబ్బతీసే ప్రయత్నంలో బంగ్లాదేశ్ ఉందని భారత అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్‌కి ఇచ్చిన ‘‘ట్రాన్స్ షిప్‌మెంట్’’ సౌకర్యాన్ని రద్దు చేసింది. అయితే, భారత్ నిర్ణయం వల్ల తమపై ఎలాంటి ప్రభావం ఉండదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ వాణిజ్య సలహాదారు షేక్ బషీర్ ఉద్దీన్ గురువారం అన్నారు. పశ్చిమాసియా, యూరప్ మరియు నేపాల్ మరియు భూటాన్ మినహా వివిధ ఇతర దేశాలకు వివిధ వస్తువులను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్‌కు మంజూరు చేసిన ట్రాన్స్-షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు భారతదేశం బుధవారం ప్రకటించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిన్న వివిధ రంగాలకు చెందిన వ్యాపార ప్రతినిధులతో, కొనుగోలుదారులతో చర్చలు జరిగాయి. మా ఏర్పాట్ల ద్వారా సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.
Read Also: MS Dhoni: ఇట్స్ అఫీషియల్.. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోని
భారత్ నిర్ణయంపై మీడియా ప్రశ్నించడంతో బషీర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని, పెరిగిన ఖర్చులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. రద్దుకు సంబంధించి బంగ్లాదేశ్ భారత్‌కి అధికారికంగా లేఖ పంపే విషయం పరిశీలనతో లేదని అతను చెప్పాడు.
భారత్, బంగ్లాదేశ్‌కి మధ్య దాదాపుగా 1600 కి.మీ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్‌కి మూడు వైపులు భారత్, ఒక వైపు బంగాళాఖాతం ఉంది. బంగ్లాదేశ్ తన ఉత్పత్తుల్ని అమ్ముకోవాడానికి ఇన్నా్ళ్లు ఈ ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యం ద్వారా భారతదేశ రోడ్డు రవాణాతో పాటు పోర్టుల్ని వాడుకుండి. తన ఉత్పత్తుల్ని భారత్ ద్వారా భూటాన్, నేపాల్ వంటి దేశాలకు తరలించింది. అయితే, ఇప్పుడు భారత్ దీనిని రద్దు చేయడంతో బంగ్లాదేశ్‌ని దెబ్బకొట్టినట్లు అయింది. బంగ్లాదేశ్ తన ఉత్పత్తులను అమ్ముకోవాలంటే మయన్మార్ లేదా తన చిట్టగాంగ్, మోంగ్లా పోర్టులను ఉపయోగించాలి. అయితే, ఈ పోర్టు్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఇన్నాళ్లు కోల్‌కతా, పారాదీప్ పోర్టుల ద్వారా తన ఉత్పత్తుల్ని యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాలకు బంగ్లాదేశ్ పంపేది. భారత్ నిర్ణయంతో బంగ్లాదేశ్ మరింత కుదేలు అవ్వడం ఖాయం.