Pregnant Spouse: గర్భిణిపై భర్త సిమెంటు దిమ్మెలతో హత్యాయత్నం… హైదరాబాద్‌లో దారుణం – Telugu Information | Husband brutal assault on his spouse in hyderabad

Written by RAJU

Published on:

కడుపుతో ఉన్న భార్యను నడిరోడ్డుపై సిమెంట్ ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన. హఫీజ్ పేట ఆదిత్య నగర్ లో ఉంటున్న మహ్మద్ బస్రత్ (32) ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023 జనవరిలో అజ్మేర్ దర్గాకు వెళ్ళే సమయంలో బస్సు లో పశ్చిమ బెంగాల్ కు చెందిన షబానా పర్వీన్ (22) పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2024 అక్టోబర్ లో కోల్కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకొని హఫీజ్ పేట కు తీసుకొచ్చాడు.

వేరే కాపురం పెడదామన్న పర్వీన్ ఒత్తిడితో తల్లిదండ్రులను కాదని అదే బస్తీలో అద్దెకు ఉంటున్నాడు. అప్పటినుంచి భార్యభర్తల మధ్య విభేదాలు మొదలై.. తరచూ గొడవపడుతున్నారు. ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది. రెండు నెలల గర్భంతో ఉన్న ఆమెకు వాంతులు అధికమవడంతో మార్చి 29న భర్త ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడ టంతో ఏప్రిల్ 1న రాత్రి 10 గంటల సమయంలో భార్యను డిశ్చార్జి చేయించుకొని బయటకొచ్చాడు.

ఈ క్రమంలో మళ్లీ ఇద్దరు గొడవపడ్డారు. రెచ్చిపోయిన బసరత్ భార్యను ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై పడేసి ఇష్టానుసారంగా దాడి చేశాడు. పక్కనే సిమెంట్ ఇటుక రాయి తీసుకొని ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టాడు. ఆమె చనిపోయిందనుకుని పారిపోయాడు. భర్త స్నేహితులు వచ్చి ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడి నుండి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి ఆ తర్వాత ఈరోజు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Subscribe for notification
Verified by MonsterInsights