ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి.
నవతెలంగాణ – భువనగిరి
భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలను 2025 ఏప్రిల్ 25,26,27 తేదీలలో ఖమ్మం నగరంలో జరుగుతాయని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు ఆర్ఎల్ మూర్తి తెలిపారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ఉన్నదన్నారు, రాష్ట్రంలో నిత్యం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణలో పోరాడుతున్నారు. విద్యారంగంలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా నడిపింస్తుందన్నారు. నూతన విద్యాసంస్కరణలు పేరుతో విద్యరంగంలో తీసుకు వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, విద్యార్థులందరిని ఐక్యం చేసి దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నడుపుతుందని అన్నారు.ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న పాలకులు విద్యను అంగడి సరుకుగా మార్చి అణగారిన, పేద వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు ఆధునాతన విద్యావిధానం పేరుతో విద్యలో సమూల మార్పులు అంటూ నూతన విద్యా విధానం- 2020 తీసుకువస్తుందన్నారు. విదేశీ యూనివర్సిటీలను దేశ విద్యరంగంలోకి అనుమతిస్తూ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలను విద్యారంగంలోకి ఆహ్వానిస్తున్నారు. నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే విధానాలు అమలు చేస్తుందని రాష్ట్రంలో పెండిరగ్ స్కాలర్షిప్స్ ఫీజురీయంబర్స్ విడుదల చేయాలన్నారు. సంక్షేమ, గురుకుల వసతిగృహాలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, స్వంత భవనాలు నిర్మించాలని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కారం చేయాలని నిరంతరం పోరాడుతుందన్నారు. కేవలం
పోరాటాలు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని ఖమ్మంలో వరదలు వచ్చిన సందర్భంలో వాలంటీర్లుగా సేవలు అందించింది. కరోనా సందర్బంలో రెడ్ వాలంటీర్లు పేరుతో ఐసోలేషన్ కేంద్రాలలో సేవలు అందించిందన్నారు. కరోనా బాధితులకు భోజనాలు అందించి సేవ కార్యక్రమాలు నిర్వహించింది. విద్యార్థులలో సృజనాత్మకతను పెంచేందుకు, అనేక అంశాలపై అవగాహన సదస్సులు, మహిళల రక్షణకై సదస్సులు, టాలెంట్ టెస్టులు, రక్తదాన శిబిరాలు, శ్రమదానాలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులలో దేశభక్తి భావాలు పెంపు కోసం జాతీయోద్యమ వీరుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా సెమినార్లు, బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. శ్రమ సంస్కృతి లో భాగంగా కార్మికుల, వ్యవసాయ కార్మిక, రైతాంగ పోరాటాలలోనూ పాల్గొంటూ వారికి మద్దతుగా నిలుస్తుందన్నారు. సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కులం పోవాలని, కులనిర్మూలన, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. మతసామరస్యం, ప్రజాస్వామ్యం లాంటి రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వాటి పరిరక్షణకై పాటుపడుతుందన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర విద్యారంగ పరిరక్షణకు, విద్యార్థి పోరాటాలకు దిక్సూచి కానున్న ఎస్ఎఫ్ఐ 5వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విద్యార్థులు, మేధావులు, సామాజిక వేత్తలు అందరూ కలసి జయప్రదం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, పట్టణ అధ్యక్షులు నేహాల్ ,జిల్లా కమిటీ సభ్యులు భవనీ శంకర్,నాయకులు చింటూ సాయినాథ్, మహేష్,పవన్, రాకేష్,ప్రకాష్ పాల్గొన్నారు.