నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలోని సీతారామ చంద్రస్వామి ఆలయంలో స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తూ ..కేతేపల్లి మండలం బండపాలెం గుట్టఫై శ్రీరామనవమి రోజున స్వామి వారి కళ్యాణాన్ని వందల ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి రాములోరిని రెండూళ్ల దేవుడిగా పిలుస్తుంటారు. ఈ రెండు గ్రామాల ప్రజలు శ్రీరాముడిని ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు
రెండు ఊళ్ళ రాముడికి ఉన్న ఘనమైన చరిత్ర..
17వ శతాబ్దంలో భద్రుడు, సారంగుడు అనే ఋషులు శ్రీరాముడి కోసం తపస్సు చేశారు. బద్రుడు తపస్సు చేసిన ప్రాంతం భద్రాద్రిగా, సారంగడు తపస్సు చేసిన ప్రాంతం సారంగచలంగా స్థానికులు చెబుతుంటారు. ఆ సారంగచలమే నేటి బండపాలెంగా రూపాంతరం చెందింది. బండపాలెం గ్రామానికి తూర్పున ఉన్న పర్వతాన్ని సారంగ చలమని, అక్కడి గుహా అంతర్భాగంలో వెలసిన శ్రీరామచంద్రస్వామిని సారంగజల రాముడని పిలుస్తుంటారు.
నిత్య పూజలు ఓచోట .. కళ్యాణం మరోచోట..
శ్రీరాముడు వెలసిన ప్రాంతం ఒకప్పుడు అభయారణ్యంతో నిండి ఉండేది. నిత్య పూజలు జరపడానికి ఇబ్బందులు ఉండడంతో అప్పటి వెలమ దొరలు చందుపట్ల గ్రామంలో ఆలయాన్ని నిర్మించారు. చందుపట్ల గ్రామంలోని ఆలయంలో ఏడాదంతా పూజలు నిర్వహించి శ్రీరామ నవమికి ముందు స్వామి వారిని పల్లకిలో బండపాలెం గ్రామంలోని గుట్ట పైకి తరలిస్తారు. చైత్ర శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు బండపాలెం గట్టపై స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలతోపాటు మహ శ్రీరామనవమి రోజున వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం ఏకాంత సేవ, రథ సేవలు ముగిసిన తరువాత సీతారామచంద్రస్వామిని గట్టుమీద నుంచి చందుపట్ల గ్రామానికి తరలించడం ఆనవాయితీగా వస్తుంది.
పల్లకి సేవలో బోయలు..
చందుపట్ల గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండపాలెం గుట్టపైకి ఉత్సవ మూర్తులను తీసుకెళ్లడానికి పల్లకి సేవలు ఉపయోగిస్తారు. 100 మంది బోయలు పల్లకి సేవలను మోస్తూ ఉత్సవ మూర్తులను బండ పాలెం చేరుస్తారు. ఈ సమయంలో ఉత్సవ మూర్తులను తీసుకువెళ్లే సమయంలో కోలాటం నృత్యాలు, భజనలు చేస్తూ భక్తులు అంగరంగ వైభవంగా స్వామివారిని గట్టపైకి చేరుస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు స్వామి వారికి జరిగే సేవలకు పల్లకి మోయడం ఆచారంగా వస్తోంది.
కోనేటి ప్రత్యేకత..
బండపాలెం గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1200 మీటర్ల లోతులో ఉన్న కోనేరు వందల ఏళ్లుగా ఇప్పటివరకు ఎండిపోకుండా ఉండడం ఇక్కడి విశిష్టత. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో ఈ కోనేరులో నీటిమట్టం పెరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఈ కోనేరు రాముడు పాదం వల్ల ఏర్పడిన ముద్రగా ఇక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ నీరు సేవిస్తే ఎలాంటి రోగాలనైన నయం అవుతాయనేది ఇక్కడి గ్రామస్తుల నమ్మకం. చేస్తుందనేది నమ్మకం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..