ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే.. ఇదిగో లేదు, అదిగో లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇంతకీ ఈ జాప్యం దేనికి? అధిష్ఠానం మనసులో ఏముంది? ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుంది? కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయవర్గాల్ని తొలిచేస్తున్న ప్రశ్నలివి.
రేపోమాపో తెలంగాణ కేబినెట్ విస్తరణ విస్తరణ జరగబోతోందన్న ప్రచారం ఊపందుకున్న వేళ… అదంతా ఉత్తిదేనన్న కొత్త ప్రచారం తెరమీదకొచ్చింది. గత 16నెలలుగా మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠకు.. హైకమాండ్ తెరదించబోతోందనుకుంటే… ఆశావహులకు మరోసారి నిరాశే ఎదురైంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. విస్తరణ ప్రక్రియను కొన్నాళ్లు వాయిదా వేయడమే బెటర్ అనుకుంటున్నారట ఏఐసీసీ పెద్దలు. నిజానికి పదిరోజుల ముందే.. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఫైనల్ అయిపోయిందనే ముచ్చట రాజకీయవర్గాల్లో బలంగా వినిపించింది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన రాహుల్‌గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారనీ, ఎప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనీ.. హస్తం నేతలే లీకులిచ్చారు. కానీ, ఆ తేదీ దాటిపోయినా… కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయమూ రాలేదు. చావుకబురు చల్లగా చెప్పినట్టు… మళ్లీ వాయిదా అంటూ.. ఆశావహులకు షాకిచ్చారు ఏఐసీసీ నాయకులు.
అయితే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ హైకమాండ్‌కు ఎదురవుతున్న అడ్డంకులేంటి? ఈ మల్లగుల్లాలు పడటానికి కారణమేంటి? అన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రిమండలిలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. కానీ, ఆశావహుల సంఖ్య మాత్రం అరవై ఆరుకు మించి ఉండొచ్చు. పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా… జిల్లా ,సామాజిక సమీకరణలు ఎంత బేరీజు వేసుకున్నా… అంతమందిని ఈ ఆరుపదవుల్లో సర్దేయడం అంత వీజీ కాదు. అందుకే, విస్తరణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేబినెట్లో స్థానం కోసం కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువగా పోటీ ఉంది. పరిస్థితి చూస్తుంటే.. ఆరు పదవుల్లో ఒకటి మాత్రమే రెడ్డి నేతకు ఇచ్చే అవకాశం ఉందట. దీంతో, ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉందట. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డిలు.. బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరికి ఇచ్చినా మిగితావారి అసంతృప్తిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యమైన విషయం. అందుకే విస్తరణవైపు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్.
కేబినెట్లో సామాజిక సమతుల్యత అనే అంశం.. ఇప్పుడు కీలకంగా మారింది. బీసీ,ఎస్సీ, ఎస్టీ సాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు… ఎవరికివారుగా హైకమాండ్‌కు లేఖలు రాస్తుండటం… మంత్రివర్గ విస్తరణను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌లపేర్లు బీసీ సామాజిక వర్గంనుంచి పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా.. మాదిగ, లంబాడా ఎమ్మెల్యేలు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ.. మూకుమ్మడిగా కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖలు రాశారు. ప్రాంతాలవారీగా విడిపోయిన నేతలు… తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీవెళ్లి మరీ విజ్ఞాపనలు అందజేస్తున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్, రంగారెడ్డి నేతలకు కేబినెట్లో చోటు ఇవ్వలేదనీ.. ఈదఫా అవకాశం కల్పించాలనీ… ఖర్గేను కలిసి మరీ విజ్ఞప్తి చేశారు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు. ఓవైపు లేఖలు.. మరోవైపు విజ్ఞప్తులు… ఇంకోవైపు సామాజిక లెక్కలు.. అంతకంతకూ పెరిగిపోతున్న ఆశావహులు… వెరసి కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్న ముచ్చట వినిపిస్తోంది. అందుకే, కేబినెట్ విస్తరణను మరోసారి వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న హడావుడి అంతా ఒకెత్తయితే.. సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్‌కు రాసిన లేఖ మరో ఎత్తు అన్నట్టుగా మారింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు ఛాన్సివ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసిన ఈ సీనియర్ నేత.. నల్గొండ జిల్లాకు మూడో మంత్రి పదవి విషయంలో ఏవిధంగానూ స్పందించకపోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో, ఆ జిల్లానుంచి భారీ స్థాయిలో ఉన్న ఆశావహుల్లో ఆందోళన మొదలైందట. ఇప్పటికే ఆ జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డి, అద్దంకి దయాకర్, పద్మావతి, శంకర్ నాయక్, బాలూనాయక్.. ఈ రేసులో ఉన్నారు. విస్తరణలో ఒక రెడ్డినేతకు అవకాశం ఇస్తామంటూ ఇటీవల రాష్ట్రనేతలకు చెప్పిన హైకమాండ్ పెద్దలు.. ఎవరికివ్వాలో తేల్చిచెప్పాలని అడిగారట. రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయగా… కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ మాట్లాడుదామంటూ.. మీటింగ్‌ను ముగించారంట పెద్దలు.
ఇన్ని లెక్కల మధ్య… ఇన్ని ఈక్వెషన్స్ మధ్య… మంత్రిపదవి విషయంలో ఆశావహుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవ రెడ్డి , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబడుతుండగా , దొంతి మాధవరెడ్డి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా ఎవరికివారు చేస్తున్న ప్రయత్నాలతో… హైకమాండ్ కన్ఫ్యూజన్లో పడిపోయినట్టు తెలుస్తోంది. వేసుకున్న లెక్కలేవీ వర్కవుట్ కాకపోవడంతో.. ఎప్పటికప్పుడు నేడే విడదుల అనడం తప్ప… కేబినెట్ విస్తరణ మాత్రం కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. మరి ఈ ఎపిసోడ్‌ను ఏఐసీసీ పెద్దలు ఎన్నాళ్లు సాగదీస్తారన్నదే ఇప్పుడు… పొలిటికల్ సస్పెన్స్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..