యుద్ధం మొదలుపెట్టిన వారం రోజుల్లో గెలవాల్సిందన్న ట్రంప్
వారం రోజుల్లో గెలిచి ఆపేయాల్సిన యుద్ధాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తూ అమాయక రష్యన్ల ప్రాణాలు తీస్తున్నాడంటూ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సాగదీస్తున్నాడని విమర్శించారు. ఉక్రెయిన్ పై విజయం సాధించడానికి జస్ట్ ఏడు రోజులు సరిపోతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం ఆయా దేశాధినేతలకు ఒకరిపై మరొకరికి ఉన్న ద్వేషమేనని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీపై ద్వేషంతో పుతిన్ అటు ఉక్రెయిన్ పౌరులతో పాటు ఇటు రష్యన్ల ప్రాణాలు తీస్తున్నాడని ఆరోపించారు.వారి మధ్య ఉన్న ద్వేషం వల్లే యుద్ధానికి ముగింపు పలకడం కష్టమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపి, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని ఆయన తెలిపారు. అయితే, వారు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు జరుపుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పిన తాను ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపలేకపోతున్నాననే ప్రచారం జరుగుతోందని, కానీ త్వరలోనే పుతిన్, జెలెన్ స్కీల మధ్య రాజీ కుదురుస్తానని ట్రంప్ పేర్కొన్నారు. వారం రోజుల్లో ముగించాల్సిన యుద్ధాన్ని నాలుగేళ్లుగా సాగదీయడం వల్ల పుతిన్ కు చెడ్డపేరు వస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
The post ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు appeared first on Visalaandhra.