Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అభిషేక్ శర్మ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. తండ్రి రాజ్ కుమార్ శర్మ సంచలన వ్యాఖ్యలు – Telugu News | Abhishek Sharmas SRH Entry Father Reveals Rahul Dravid’s Crucial Role in the Trade Deal

అభిషేక్ శర్మ ఒక నల్లటి ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. దీని ధర భారతదేశంలో రూ. 3.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు.

Abhishek Sharma : భారత టీ20ఐ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో అద్భుతంగా రాణించి, జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ టాలెంటును టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఎప్పుడో గుర్తించారు. ఆయన కారణంగానే అభిషేక్ శర్మకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో ఒక అరుదైన అవకాశం లభించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బౌలర్లను భయపెడుతున్న ఈ బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‎లోకి ఎలా వచ్చారనే కథ చాలా ఆసక్తికరంగా ఉంది.

అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‎లో అభిషేక్ ఎంట్రీకి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టారు. 2018లో కేవలం 17 ఏళ్ల వయస్సులో అభిషేక్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్ 19 బంతుల్లో 46 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ, ఆ సీజన్‌లో అతనికి కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఆ తర్వాత సీజన్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న శిఖర్ ధావన్‎ను తమ జట్టులో చేర్చుకోవడానికి ప్రయత్నించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ శిఖర్ ధావన్‌ను కోరినప్పుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్‎ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ శిఖర్ ధావన్‌కు బదులుగా అభిషేక్ శర్మను తమకు ఇవ్వాలని కోరారని రాజ్‌కుమార్ శర్మ వివరించారు. “అభిషేక్ శర్మనే ఎందుకు కావాలి?” అని లక్ష్మణ్‌ను అడగగా, “నాకు తెలియదు, కానీ రాహుల్ ద్రవిడ్ ఈ అబ్బాయి చాలా టాలెంటెడ్ అని, భవిష్యత్తులో చాలా గొప్పగా ఆడతాడని చెప్పాడు” అని లక్ష్మణ్ చెప్పారట. అలా, రాహుల్ ద్రవిడ్ అంచనా, సిఫార్సు కారణంగానే 2019 నుంచి అభిషేక్ శర్మ సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు. ఇక్కడే తన టాలెంటును ప్రదర్శించడానికి అతడికి సరైన అవకాశం లభించింది.

అభిషేక్ శర్మ సన్ రైజర్స్ తరఫున ఇప్పటివరకు 74 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 27.10 సగటుతో 1753 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున 24 టీ20ఐ మ్యాచ్‌లలో 36.91 సగటుతో 849 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు 2018లో భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కూడా అభిషేక్ మెయిన్ ప్లేయర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment