Handshake Controversy : ఆసియా కప్ అవమానం ఇంకా మర్చిపోని పాకిస్తాన్..మరోసారి తెరమీదకు హ్యాండ్ షేక్ వివాదం – Telugu News | Ramiz Raja and Aamir Sohail Recall Asia Cup Handshake Controversy During PAK vs SA Test Match

Handshake Controversy : ప్రస్తుతం పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. దీనిలో మొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో కామెంటరీ చేస్తున్న సమయంలో మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, అమీర్ సోహైల్… ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు తమ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ చేయకపోవడాన్ని గుర్తు చేసుకున్నారు. టోర్నమెంట్ ముగిసి 17 రోజులు దాటినా కూడా, ఆ అవమానాన్ని పాకిస్తాన్ ఇంకా మర్చిపోలేక ఆ షాక్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆసియా కప్ గ్రూప్ స్టేజ్, సూపర్-4, ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు సార్లు మ్యాచ్‌లు జరిగాయి. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో హ్యాండ్ షేక్ చేయలేదు. భారత ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ ప్లేయర్లతో సరిగా షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం అప్పట్లో పెద్ద వివాదమైంది. ఈ అవమానం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు తర్వాతి మ్యాచ్‌లలో అగౌరవంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. టోర్నమెంట్ పూర్తై ఇన్ని రోజులు గడిచినా ఆ సంఘటనను పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు.

తాజాగా పాకిస్తాన్ సౌతాఫ్రికాను తొలి టెస్టులో ఓడించిన తర్వాత, రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కామెంటరీలో ఉన్న అమీర్ సోహైల్, రమీజ్ రాజా పాత విషయాన్ని ప్రస్తావించారు. అమీర్ సోహైల్ మాట్లాడుతూ.. “రెండు జట్ల ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేసుకోవడం చూడటానికి చాలా బాగుంది. ఈ రోజుల్లో ఇది తగ్గిపోతోంది” అన్నారు. దీనికి రమీజ్ రాజా స్పందిస్తూ.. “ఇది గొప్ప సంప్రదాయం. రాను రాను చేజారిపోతుంది. క్రికెట్ అంటేనే సంప్రదాయం, పెద్దరికం, నిజాయితీ. సౌతాఫ్రికా ఈ విషయంలో తెలివిగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

ఆసియా కప్‌లో పాకిస్తాన్ మూడుసార్లు భారత్‌తో తలపడింది. దురదృష్టవశాత్తు, మూడు సార్లు కూడా భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి కేవలం ఆటగాళ్లకే కాదు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు, యావత్ పాకిస్తాన్ దేశానికి తీవ్ర ఆగ్రహాన్ని, అవమానాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన సంఘటన పాకిస్తాన్‌ను ఇంకా షాక్‌లోనే ఉంచింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు మైదానంలో పాకిస్తాన్‌ను ఓడించడమే కాకుండా, వారి మనోబలాన్ని కూడా పూర్తిగా దెబ్బతీశారని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment