పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్

అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం

సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం

చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు

గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి దారితీసిన పేరు మోసిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, అలియాస్ భూపతి సరెండర్ ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు సామాజిక రాజకీయ, పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలలో కూడా కీలక చర్చనీయాంశం అయింది. ఈ అజ్ఞాతపు , లోగుట్టు ఎవరికీ అంతుపట్టని నక్సల్ భూపతి నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్లుజి) వ్యవస్థాపక సభ్యుల కేడర్‌లోని వాడు. నక్సల్స్ ఉద్యమానికి కీలక వ్యూహకర్త. దశాబ్దాలుగా మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్ సరిహద్దులలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడంలో ప్రధాన భూమిక వహించాడు. ఆయన ప్రభావం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో కూడా నక్సలైట్ల ఉద్యమంపై బలీయంగానే ఉంది. ఆయనను పట్టిస్తే రూ 6 కోట్ల నజారానాను ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకాలం రెండురోజుల క్రితం వరకూ దట్టమైన అరణ్యంలో దళాల మధ్య నాయకత్వంతో గడిపి, సాయుధ పోరాటమే జీవితం అని నిర్ధేశితంగా గడిపిన వ్యక్తి ఇప్పుడు తనతో పాటు 60 మంది నక్సల్స్‌తో సహా పోలీసులకు లొంగిపొయ్యారు. ఇప్పుడు గడ్చిరోలి పోలీసు కస్టడీకి తరలివెళ్లారు.

నక్సల్ సమస్య లేకుండా చేస్తామనే కేంద్ర ప్రభుత్వ, ప్రత్యేకించి హోం మంత్రి అమిత్ షా పదేపదే చేస్తున్న ప్రకటనల క్రమంలో నెలరోజులుగా తెరవెనుక సాగిన మంతనాలు, క్షేత్రస్థాయిలో పరిణామాల నేపథ్యంలో ఇక మరో మార్గం లేదని గుర్తించే మల్లోజుల సరెండర్ అయ్యాడా? లేక మరేదైనా వ్యూహాత్మక అంశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 69 సంవత్సరాల ఈ భూపతి మావోయిస్టుల సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా. ఆయన తన బృందంతో సరెండర్ కావడం, ఇప్పుడు సాగుతున్న నక్సల్ బలహీనత సంకేతాలకు ప్రధాన అంశం అయింది .ఒక ధైర్యసాహసాల తుపాకీ యోధుడి కోణం, ఇప్పుడు అటువంటి వ్యక్తిలో నెలకొన్న ఆత్మనూన్యత భావం, క్రమేపీ రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం సరెండర్‌కు దారితీసిందని ఈ విషయాలపై అవగావహన గల సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

గత నెలలోనే ఆయన వామపక్ష తీవ్రవాదం తన చివరి దశలో ఉందనే విషయం గుర్తించాడని ఈ అధికారి పేరు చెప్పకుండా తెలిపారు. తాను సరెండర్ అవుతానని, తనతో కలిసి లొంగిపోయే వారు కలిసి రావచ్చునని చాలా రోజులుగా ఆయన అంతర్గతంగా కరపత్రాలు సందేశాలు, చివరికి ప్రెస్‌నోట్లు వెలువరించిన విషయాన్ని ఈ పోలీసు అధికారి గుర్తు చేశారు. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజులకు కేడర్‌లో అనేక మారుపేర్లు ఉన్నాయి. సోనూ , అభయ్,వ వివేక్‌గా కూడా పేరుమోశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి మల్లోజుల వెంకటయ్య నుంచి స్ఫూర్తి పొందే కొడుకు ఈ అడవిబాట పట్టినట్లు , ఎన్నో ఏళ్లుగా తన ఊరివారికి కూడా అజ్ఞాతుడై, అడవిచుక్క అయ్యాడని కరీంనగర్ వ్యక్తి ఒకరు తెలిపారు.

ఈ ఏడాది ఆరంభంలోనే భార్య తారక్క సరెండర్

తనతో పాటు కేడర్‌లో పనిచేసిన భూపతి భార్య తారక్క ఈ ఏడాది ఆరంభంలోనే సరెండర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇక ఆయన సరెండర్ సూచనలు బలోపేతం అయ్యాయి. సాయుధ పోరాటం అనేది ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడిందని, ఇప్పుడు ఈ విప్లవ సిద్ధాంత విఫల అధ్యాయం అని ఆయన తరచూ భావించారని, ఈ మేరకు తమకు నిర్థిష్ట సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఇకపై ఏం చేయగలం? ఏం సాధిస్తాం? ఏం సాధించామనే ఆలోచనలు ఆయనలో మిక్కుటం అయ్యాయి. ఇవన్నీ కూడా ఆయన సరెండర్ నిర్ణయానికి దారితీశాయి. ముందుగా భార్యను జనజీవితంలోకి పంపించాడని, ఇప్పుడు తాను సరెండర్ అయ్యాడని, ఇది కీలక పరిణామమే అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

సరెండర్ సంకేతాలు రాగానే ఆయన డోలాయమాన పిరిస్థితిని పసిగట్టామని, దీనితో ఇక ఆయన కోసం గాలించకుండా , మర్యాదపూర్వకంగా సరెండర్ అయ్యేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించామని,ఈ మేరకు తమ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశామని పోలీసు బాస్ వెల్లడించారు. ఈ దిశలో నమ్మకస్తులైన వారి ద్వారా ముందుగా ఆయననుఏ భమార్‌గఢ్ ప్రాంతంలో సంప్రదించడం జరిగిందని వివరించారు. ఇంతకాలం చట్టానికి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చట్టం ముందు లొంగిపోతే ఇకపై ఎటువంటి ముప్పు ఉండకుండా చూస్తామనే భద్రతను క్రమేపీ కల్పించామని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లొంగుబాటు జరిగిందని వివరించారు.

10 రోజుల క్రితమే పల్లెజనం ముందు వెల్లడి

పదిరోజుల క్రితమే భూపతి కొందరు నక్సల్స్‌తో కలిసి ఫోడేవాడా ప్రాంతంలో గ్రామస్తులతో ముచ్చటించి వెళ్లారు. ఇక తాను అడవుల్లో నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చిందని చెప్పినట్లు తమకు రూఢిగా తెలిసిందని వివరించారు. ఇంతకాలపు హింసాత్మక మార్గాన్ని వీడి ఇప్పుడు తమ ముందుకు వచ్చాడని పోలీసు అధికారి చెప్పారు. దీనితో 40 సంవత్సరాల ఆయన ఈ సుదీర్ఘ ప్రస్థానం ముగిసిందని ఆయన గురించి తెలిసిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఈ నెల 13వ తేదీన తెరవెనుక మంతనాలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నేతతో ఓ పోలీసు అధికారి కలిశారు. అంతకు ముందు చాలా కాలంగా భూపతి కదలికలను గమనిస్తూ, ఆయన సరెండర్‌కు యత్నించిన ఈ పోలీసు అధికారి అదే రోజు ఆయన సరెండర్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఆయన చెప్పినట్లే భామర్‌గఢ్ తాలూకలోని హోదారి కుగ్రామం వెలుపల ఆయన ఆయన భారీ బృందంతో సరెండర్ అయ్యారు. దీనితో ఇక నక్సల్స్ ఉద్యమంలో సంధ్యకాలం ఏర్పడింది.

ఈ భూపతి, తన నక్సల్స్ బృందంతో సరెండర్ అయిన తరువాత ప్రత్యేకించి ఇప్పుడు మిగిలిన వామపక్ష తీవ్రవాదం దిశ దశ దిక్సూచి ఏమిటనేది అటు నక్సల్స్, ఇటు పౌర సమాజం, మేధావుల్లో పలు ఆలోచనలకు దారితీసింది. ఈ భూపతి బృందం పది మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు ఆత్మసమర్ఫణకు దిగారు. ఈ క్రమంలో 54 ఆయుధాలు కూడా అప్పగించారు. సాయుధ పోరాట లక్షం గతితప్పిందనే మల్లోజుల మనోగతం తరువాతి క్రమంలో ఈ అడవిదారుల ఉద్యమ పంథా ఏమిటనేది అడవుల్లో చప్పుడు అయింది.

Leave a Comment