Women’s ODI World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి టోర్నీని బాగానే ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు టోర్నీలో నిలబడాలంటే హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా.. ఇంగ్లండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే, ఆ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐసీసీ జరిమానా విధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన 13వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు మరో పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు గాను, ఐసీసీ భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించింది. గతేడాది ఇదే ఆస్ట్రేలియాపై జరిగిన మూడు వన్డేల సిరీస్ చివరి మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ టీమ్ ఇండియాకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో ఓడి సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో కూడా అదే కథ రిపీట్ అయింది.
ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ స్మృతి మంధాన 66 బంతుల్లో 9 బౌండరీలు, 3 సిక్సర్లతో 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. అలాగే, ప్రతికా రేవల్ 96 బంతుల్లో 10 బౌండరీలు, 1 సిక్సర్‌తో 75 పరుగులు సాధించింది. వీరిద్దరి పోరాటం కారణంగానే భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
భారత బ్యాట్స్మెన్ల ప్రయత్నాలను ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ వృథా చేసింది. ఆమె అద్భుతమైన సెంచరీతో ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించింది. హీలీ కేవలం 107 బంతుల్లో 21 బౌండరీలు, 3 సిక్సర్లతో 142 పరుగులు సాధించింది. ఆమె అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం లక్ష్యాన్ని చేరుకుంది. వరుస ఓటములు, ఐసీసీ జరిమానాతో కుంగిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై గెలిచి టోర్నీలో నిలదొక్కుకోవాలని చూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..