Mithra Mandali Movie Review: నటీనటులు: ప్రియదర్శి, నిహారిక NM,రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా, సత్య, VTV గణేష్, వెన్నెల కిషోర్ తదితరులు.
సంగీతం: RR ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ SJ
దర్శకుడు: విజయేందర్ S
కితకితలు పెడితే నవ్వడానికి.. పిచ్చి సొల్లు కామెడీ చేస్తే నవ్వడానికి తేడా ఉంటుంది.. ఫార్స్ కామెడీ, స్క్రూబాల్ కామెడీ ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉండే కామెడీ జోనర్స్(అసలైతే కామెడీ జాన్రాస్ అని పిలవాలి, కానీ తెలుగువాళ్ళం కదా ఇలానే పిలుచుకుందాం). సింపుల్ గా మాట్లాడుకుంటే సిల్లీ కామెడీ. ఈ ఉపోద్ఘాతం చెప్పకుండా అసలు రివ్యూ లోకి వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఈ జోనర్ లోనే వచ్చిన జాతి రత్నాలు హిట్ అయినప్పటికీ ఎంతమంది ఆ సినిమాను చీల్చి చెండాడారో, ఇంకా చెండాడుతూ ఉన్నారో అందరికీ తెలుసు. హాలీవుడ్ లో ఇది పాపులర్ జోనర్ అయినప్పటికీ మనకి తెలుగులో అరుదే. అప్పుడెప్పుడో SV కృష్ణారెడ్డి గారు శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించిన వినోదం అనే సినిమా ఈ జోనర్ కు చెందినదే. ఇక జాతి రత్నాలు అయితే మనకి తెలుగులో ఈ జోనర్ లో కల్ట్ క్లాసిక్. అదే కోవలో వచ్చిన మిత్రమండలి వస్తుందని అని ట్రైలర్ తోనే క్లియర్ గా సభ్య సమాజానికి వినోద సందేశం అనే హింట్ ఇచ్చారు ఫిల్మ్ మేకర్స్.
సినిమాలో ఎన్నో విషయాలు ఉంటే అవి కాకుండా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే చాలామంది జనాలు ఈ సినిమాను చూసి సిల్లీగా ఉందని అంటారు. ఈ సినిమా సీల్లీగానే ఉంటుంది.. ఎందుకంటే హారర్ సినిమాలో నాకు భయమేసింది.. దెయ్యం వచ్చింది అనడం, బూతు సినిమాలో బూతు ఉందని గగ్గోలు పెట్టడం ఎంతో మహాపాపమో సీల్లీ కామెడీ సినిమాలో సీన్స్ సిల్లీగా ఉన్నాయి, డైలాగ్స్ సిల్లీగా ఉన్నాయి, పాటలు సిల్లీగా ఉన్నాయి అనడం అంతకంటే ఘోరపాపం. అపరిచితుడు బుక్కులో దీనికో శిక్ష కూడా ఉండొచ్చు. ఆ శిక్ష పేరు మాత్రం ఆడక్కండి. అంత లోతుగా నేను వెతకలేను ప్లీజ్..
అనగనగా ఒక నారాయణ తుట్టె(VTV గణేష్). తుట్టె అంటే అదేదో కన్నడ సర్నేమ్ అనుకోకండి.. అదో ఫిక్షనల్ కులం. ఆ కుల పెద్దే మన నారాయణ తుట్టె, ఆయన కుటుంబానికి, ఆ కులానికి ఎంతో చరిత్ర ఉంటుంది. ముఖ్యంగా జంగ్లిపూర్ లో వారిదే హవా. తుట్టె కులం అంటే నారాయణ తుట్టె అన్నీ కోసుకుంటాడు, ఆ కులాన్ని అవమానించినవాడికి, ఇబ్బంది పెట్టినవారికి అన్నీ కోసేస్తాడు. అలాంటి ‘ఘోప్ప’ కులం నుంచి ఒక్కరూ ఇంతవరకూ MLA కాలేదు. దీంతో ఆయనకు తన కులం నుంచి తొలి MLA కావాలనే ధ్యేయం ఉంటుంది. ఈ నారాయణ తుట్టెగారి పుత్రికా రత్నమే స్వేచ్చ(నీహారిక NM),ఈమె మన హీరోయిన్. ఈ స్వేచ్ఛను ఎవరు ప్రేమించారు, ఈ స్వేచ్ఛ ఎవరిని ప్రేమించింది. దీని వల్ల నారాయణ తుట్టెగారికి, MLA కావాలనే ఆయన ధ్యేయానికి, ఆ మహా గొప్ప తుట్టె కులానికి వచ్చిన ఇబ్బంది ఏంటి సినిమా చూసి మీరు తెలుసుకుంటే మాకు కథ మొత్తం చెప్పేశారనే తిట్లు తగ్గుతాయి.
పేరుకు సిల్లీ కామెడీనే కానీ అందులో సెటప్ మాత్రం కరెక్ట్ గా కుదిరింది. తెలుగు సమాజంలో ఉండే గొప్ప కులాల పేర్లు తీసుకోకుండా, వివాదాల జోలికి పోకుండా దర్శకుడు ఫిక్షనల్ కులం పేరుతో అన్నీ దూల కులాలను దర్శకుడు విజయేందర్ ఒక ఆటాడుకున్నాడు. ఫలానా కులం అనే పేరు పెట్టి మనోభావాలను దెబ్బతీయకుండా కరెంట్ షాక్ ఇవ్వడం అంటే ఇదే. ఇక్కడనుంచి స్టార్ట్ చేస్తే స్లోగా సిల్లీగా ఉండే నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరాలను పరిచయం చేయడం. వారు పిచ్చిపనులు చేస్తూ ఐటీలో ఉండకుండా, అమెరికాకూ పోకుండా ఏదోరకంగా సిల్లీ జీవితాలు గడిపేస్తూ ఉంటే వారి జీవితంలో కి హీరోయిన్ ను ప్రవేశపెట్టడం, ఆ అమ్మాయి వల్ల ఈ నలుగురి నలుగురి జీవితాలు అల్లకల్లోలం కావడం చాలా ఆర్గానిక్ గా జరిగిపోయింది. సిల్లీ కాబట్టి సత్య లాంటి ఇంపార్టెంట్ కారెక్టర్ ను పరిచయం చేయడం, పోలీస్ పాత్రలో వెన్నెల కిషోర్ ఫ్రస్ట్రేట్ కావడం, ఇంకా చాలా పాత్రలు చాలా రకాలుగా వచ్చి వారి కామెడీ బాధ్యతను భుజాల మీద మోయడం జరిగింది.
అన్ని జోక్స్ కు నవ్వు రావాలని లేదు కానీ కనెక్ట్ కాకపోయినా కొన్ని జోక్స్ కు అయినా నవ్వకుండా ఉండడం కష్టం. సినిమాలో ఒక చోట అసలు కథ లేదని చెప్పడం, సినిమాలో ఒక పాత్రను ఇప్పటివరకూ ఏం జరిగిందో కథ చెప్పమంటే “నా భర్త ఖైనీ తింటూ ఉండేవాడు..” అంటూ సినిమా టైటిల్స్ కంటె ముందే ప్రేక్షకులకు స్టార్ట్ అయ్యే టార్చర్ ను విజువల్స్ లో చూపించి మరీ ఆడియన్స్ ను నవ్వించడం హైలైట్స్.
సినిమాలో దర్శకుడి టాలెంట్ చాలాచోట్ల కనిపించింది. తను ఎంచుకున్న జోనర్ కు ఫుల్ జస్టిస్ చేశాడు. ఈ సినిమాలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరిని దాదాపుగా పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో మరో ప్లస్ సంగీతం.. ధృవన్ పాటలు కూడా సినిమా థీమ్ కు తగ్గట్టే మంచి ఫన్ టోన్ లో సాగాయి. లిరిక్స్ కూడా సినిమా థీమ్ లోనే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమాను జాతి రత్నాలు టెంప్లేట్ లో తీసిన మరో సినిమా అని మనం అనుకోవచ్చు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. సిల్లీ కామెడీకి కనెక్ట్ కాకపోతే చాలా బాగుండవు
2. కొన్ని చోట్ల కామెడీ చేసే ప్రయత్నంలో నవ్వు రాకపోవడం
3. మన బ్రెయిన్ కు అసలు పని చెప్పకపోవడం
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. సిల్లీగా ఉంటూనే నవ్వించడం
2. సిల్లీగా లిరిక్స్.. వినగా వినగా విపరీతంగా నచ్చే ఛాన్స్ ఉన్న పాటలు
3. సత్య ఇంపార్టెంట్ క్యారెక్టర్
ఇది జాతిరత్నాలు 2 అనుకోవచ్చు. ఆ సినిమాను ఎంజాయ్ చేసిన వాళ్ళు దీన్నీ ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమా నచ్చలేదు అంటే ఈ సినిమా నచ్చకపోయే అవకాశం ఎక్కువ. ఆ సినిమా కనుక మీకు నచ్చిందంటే ఈ సినిమాలో మీకు నవ్వులు పువ్వులు ఖాయం.
ఫైనల్ వర్డ్: జాతిరత్నాలు సిల్లీయస్ట్ అయితే ఇది సిల్లీ.
రేటింగ్: 2.75/5
ఫైనల్ వర్డ్ అయిపోయాక ఇంకా ఏంటి సోది అని మీరు కసురుకోకపోతే ఒక విషయం చెప్పాలి. రివ్యూ అంతా పాజిటివ్ గా రాసి రేటింగ్ 4 లేదా 5 ఎందుకు ఇవ్వలేదురా జఫ్ఫాగా అంటే.. ఈ జోనర్ కి ఇది పర్ఫెక్ట్ ఫిల్మ్ కానీ కనెక్ట్ కాని వాళ్ళకు ఇది నచ్చదు. జనరల్ ఆడియన్స్ వ్యూ పాయింట్ లో తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అదే కనుక సిల్లీ కామెడీ కేటగిరీలో లో దీనికి రేటింగ్ ఇవ్వమంటే తప్పకుండా దీని రేటింగ్ 4/5 .
– ✍️ రాము కోవూరు