దొంతి కాంతమ్మకు సిఎం నివాళులు | Donthi Madhava Reddy Mother Ceremony

వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం బుధవారం మధ్యాహ్నం హన్మకొండ జిల్లా కేంద్రంలోని పిడిఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఎంఎల్‌ఎ తల్లి స్మాకర దినం కార్యక్రమానికి సిఎం వస్తున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి పలువురు తన మంత్రివర్గ సహచరులతో కలిసి దొంతి కాంతమ్మకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాంతమ్మ మృతికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులతో వేదికపైనే వారితో మాటాడారు. అనంతరం ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో ప్రజలు, కార్యకర్తల ముందుకు చేరుకొని అభివాదం చేశారు. కార్యక్రమం మొత్తం 45 నిమిషాల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి పర్యటన ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపిలు కడియం కావ్య, బలరాంనాయక్, ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, కెఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

* గ్రూపులకు చెక్ పెట్టిన సిఎం పర్యటన

సిఎం రేవంత్‌రెడ్డికి నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి మధ్య గ్రూపుల తగాదాలు ఉండేవి. కొన్ని కారణాల వల్ల మాధవరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే పరిస్థితి లేకుండా ఉండేది. ప్రస్తుతం మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందడంతో ఆమె స్మారక దినం రోజు సిఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వరంగల్‌కు చేరుకొని ఆయనను, వారి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణులకు గ్రూపు తగాదాలు లేవని సంకేతం ఇచ్చినట్లు ఉంది. మాధవరెడ్డి తల్లి మృతి చెందినప్పటి నుంచి పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో పాటు మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రతీ రోజు దొంతిని కలిసి పరామర్శలు కొనసాగించారు. రేవంత్‌రెడ్డి ఎంఎల్‌ఎ దొంతి తల్లి మృతి చెందిన రోజే ఫోన్ ద్వారా పరామర్శించి పెద్దకర్మ రోజు వస్తానని, అదే రోజు ప్రోగ్రాం ఫిక్స్ చేశారు.

అయితే, ఈ కార్యక్రమానికి సిఎం రాకపోవచ్చని పార్టీ వర్గాల్లో కొంతమంది చర్చించుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్‌రెడ్డి సహచర ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడానికి ఒక మెట్టు దిగి స్వయంగా దశదినకర్మలో పాల్గొనడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొన్న తరుణంలో రేవంత్‌రెడ్డి అన్నింటినీ పక్కనపెట్టి పార్టీ ముఖ్యమన్న రీతిలో సిఎం స్థాయిలో ఎంఎల్‌ఎ తల్లి పెద్దకర్మకు హాజరుకావడం అన్ని వర్గాలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలోని అందరు ఎంఎల్‌ఎలతో పాటు దొంతికి కూడా సిఎంతో నేరుగా సంబంధాలు ఇప్పటినుంచి ఉంటాయని నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment